మొయినాబాద్: మిస్సింగ్ కేసుల్లో మొయినాబాద్ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ బాలిక అదృశ్యమై ఐదు రోజులైనా పోలీసులు కనీసం స్పందించడంలేదు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా సీడీఆర్ రాలేదంటూ కాలయాపన చేస్తున్నారు. బాధితులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా మద్దూరు మండలం గద్ప గ్రామానికి చెందిన ఆశప్ప కుటుంబం కొన్నేళ్ల క్రితం మొయినాబాద్‌కు వలస వచ్చింది. ఆశప్ప మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన చిన్న కూతురు(17) శంషాబాద్ మండలం పాలమాకుల మోడల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతోంది. దసరా సెలవులకు మొయినాబాద్‌కు వచ్చిన బాలిక బంధువుల పెళ్లి ఉండటంతో ఇక్కడే ఉంది. కాగా ఈ నెల 1న శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, స్నేహితులు, బంధువుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 2న మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోవడంలేదని.. సీడీఆర్ పెట్టాము.. అది రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పి పంపిస్తున్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై నయీముద్దీన్‌ను వివరణ కోరగా మైనర్ మిస్సింగైనా.. మేజర్ మిస్సింగైనా సీడీఆర్ వచ్చేవరకు మేం ఏం చేయలేమంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు.
● ఫిర్యాదు చేసి నాలుగు రోజులైనాపట్టించుకోని పోలీసులు
● సీడీఆర్ రాలేదంటూ కాలయాపన
Comments
Please login to add a commentAdd a comment