ఫార్మా చిచ్చు
దుద్యాల్ మండలంలో ఫార్మాసిటీ కోసం ప్రతిపాదించిన స్థలం
1,358 ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
● మూడు రెవెన్యూ గ్రామాల్లో పొలాలు కోల్పోనున్న అన్నదాతలు
● భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు
● అధికారులకు సంకటంగా మారిన భూసేకరణ
● వంద కంపెనీలు, 15వేల మందికి ఉద్యోగాల కల్పన
వికారాబాద్: కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వ్యవహారం చిచ్చు రేపుతోంది. పరిశ్రమల కోసం చేపడుతున్న భూ సేకరణ అధికారులకు సంకటంగా మారింది. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టింది మొదలు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. కడా(కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి పునాదులు వేశారు. ఇందులో విద్య, వైద్యం, సాగు నీరు, రోడ్ల అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో పరిశ్రమలు స్థాపించాలని ప్రణాళికలు రూపొందించారు. దుద్యాల్ మండలంలో ఫార్మా ఏర్పాటు ప్రక్రియ రచ్చకు దారి తీసింది. పరిశ్రమ కోసం అవసరమైన భూముల సేకరణ అధికారులు, నేతలకు తలనొప్పిగా మారింది. పొలాలు కోల్పోనున్న రైతులకు ప్రతిపక్ష నేతలు తోడవటంతో భూ సేకరణ ప్రక్రియ లాఠీ చార్జికి దారితీసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఐదు గ్రామాల పరిధిలో..
దుద్యాల్ మండలంలోని మూడు రెవెన్యూ గ్రామాలు పోలెపల్లి, లగచర్ల, హకింపేట్, నోకటిబండ తండా, పుల్చెర్లకుంట తండాల పరిధిలో 1358.37 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమకు 721 ఎకరాల పట్టా భూములు, 547 ఎకరాలు పేదలకు అసైన్డ్ చేసిన భూములు, 90 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమని గుర్తించారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి నియోజకవర్గం ఆర్థిక మండళిగా రూపాంతరం చెందేందుకు దోహదం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉండగా తాము ఎట్టి పరిస్థితిల్లో భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. భూములు ఇస్తే రోడ్డుపాలు అవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పలువురు రైతులు తమ పొలాలు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అధికారులు పేర్కొంటున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు ద్వారా పర్యావరణానికి ముప్పు వాటిళ్లటం తప్ప ఒరిగేది ఏమీలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
పరిహారం ఇలా..
2012 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ఇంకాస్త పెంచి ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో భూమికి ప్రభుత్వ విలువ ఎంత ఉంటే దానికి మూడింతలు ఇవ్వాలని 2012 భూ సేకరణ చట్టం చెబుతోంది. ఫార్మాసిటీ ఏర్పాటు చేసే ప్రాంతంలో ఎకరాకు ప్రభుత్వ విలువ రూ. 2.25 లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఎకరా భూమికి రూ.6.75 లక్షల పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ధర పలుకుతోంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఎకరాకు రూ.10 లక్షల పరిహారం, రూ.6 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఎకరానికి 125 గజాల ప్లాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ – చించోలి హైవేకి అనుకొని అభివృద్ధి చేసే డీటీసీపీ అప్రూవ్‌డ్ లేఅవుట్‌లో ఈ ప్లాట్లు ఇవ్వనున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాటు మార్కెట్ విలువ రూ. 15లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే పట్టా భూములతో పాటు అసైన్డ్ భూములకు కూడా ఒకే రకమైన పరిహారం ఇస్తామని అధికారులు అంటుండగా అందుకు తాము అంగీకరించబోమని పట్టాభూమి రైతులు పేర్కొంటున్నారు. అయితే మెజార్టీ రైతులు పొలాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
అభివృద్ధికి సహకరించాలి
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం కేవలం భూములు మాత్రమే సేకరించాలని నిర్ణయించాం. ఇందులో ఇళ్లు పోతాయని అపోహలు సృష్టిస్తున్నారు. మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూములను మాత్రమే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలన్నీ యథావిధిగా ఉంటాయి. రైతుల నుంచి వచ్చే సూచనలు ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం. రైతులు సంయమనంతో వ్యవహరించాలి. అభివృద్ధికి అందరూ సహకరించాలి.
– లింగ్యానాయక్, అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)
Comments
Please login to add a commentAdd a comment