మేమూ బీసీలమే
రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి
● చిన్న పదవులు కూడా దక్కడం లేదు
● అంతరించి పోతున్న వృత్తులకు జీవం పోయండి
● వెనుకబడిన తరగతుల కమిషన్‌కు వృత్తిదారులు, సంచార జాతుల విజ్ఞప్తి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘పేరుకు తాము బీసీలమే అయినా.. రాజకీయ రిజర్వేషన్లు దక్కడం లేదు.. ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలను పెద్దకులాలే అనుభవిస్తున్నాయి.. గ్రామాల్లో కనీసం తమను మనుషులుగా చూడడం లేదు’ అని వృత్తిదారులు, సంచార జాతుల వారు తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో అట్టడుగున ఉన్న వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ గురువారం కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేపట్టింది. కార్యక్రమానికి కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, బాలలక్ష్మి, తిరుమలగిరి సురేం దర్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన కుల సంఘాలు, వృత్తిదారులు, రాజకీయ పార్టీల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని వృత్తిదారులు, సంచార జా తుల సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గ్రా మీణ ప్రాంతాల్లోని కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి, పూసలి, వాల్మీకిబోయ, ఆరెకటిక, స గర, ఉప్పర, వడ్డెరి, క్షౌ ర వృత్తిదారులకు రాజకీయంగా కనీస ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో చాలా తక్కువ జనాభా ఉన్న ఈ సంచార జాతులు ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా నష్ట పోవాల్సి వస్తోందని, కార్పొరేటర్, కౌన్సిలర్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్, ఉప సర్పంచ్ పదవులే కాదు కనీసం వార్డు మెంబర్ వంటి చిన్న పదవులు కూడా తమకు దక్కడం లేదని కమిషన్ ముందు వాపోయారు.
ఎవరేమన్నారంటే..
సంచార జాతుల సంఘం అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ.. బీసీల్లో ఇప్పటి వరకు ఏ కులం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిందో గుర్తించి, వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదట్లో తాము ఎస్టీ జాబితాలో ఉన్నామని, ఆ తర్వాత ప్రభుత్వం తమను బీసీ–ఏలో చేర్చి అన్యాయం చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్ ఇచ్చే రుణాల కోసం 3,500 మంది దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందిన వారిలో వాల్మీకి బోయ కులస్తులు ఒక్కరూ లేరన్నారు. కుమ్మర సంఘం అధ్యక్షుడు దయానంద్ మాట్లాడుతూ.. అంతరించి పోతున్న తమ వృత్తికి జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వంద ఎకరాలు కేటాయించి వృత్తిదారులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. వడ్డెర సంఘం అధ్యక్షుడు విఘ్నేష్‌బాబు మాట్లాడుతూ.. క్వారీల్లో వడ్డెరలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రమాదవశాత్తు గాయపడిన వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు. క్షౌరవృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలు వచ్చి వృత్తిదారుల జీ వనోపాధిని దెబ్బతీశాయని, రాజకీయాల్లోనైనా రి జర్వేషన్లు వర్తింపజేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చే శారు. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు ఎ.వెంకటాచారి మాట్లాడుతూ.. కట్టెకోత మిషన్లకు 5హె చ్‌పీ వరకే ఉచిత కరెంట్ ఇస్తున్నారని, దీన్ని 10 హె చ్‌పీ వరకు పెంచాలన్నారు. 50 ఏళ్లు నిండిన వృత్తి దారులందరికీ పెన్షన్ మంజూరు చేయాలన్నారు. ఆరెకటిక సంఘం అధ్యక్షురాలు సునీత మాట్లాడు తూ.. మాంసం విక్రయాలపై ఆధారపడిన తమ వృత్తిదారులకు రాజకీయంగా అవకాశం కల్పించాలని కోరారు. సగర సంఘం అధ్యక్షుడు సతీష్‌సాగర్ మాట్లాడుతూ.. చిన్నచిన్న సివిల్ కాంట్రాక్ట్‌లు చేసు కుని జీవించే తమ వృత్తిదారులను బీసీ డి జాబితా నుంచి తొలగించి, బీసీ ఏ జాబితా లో చేర్చాలని విన్నవించారు. పూసలి సంఘం అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ.. తమకు కనీస గుర్తింపు లేకుండా పోయిందని, రాజకీయంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీ హక్కుల పరిరక్షణే ధ్యేయం
బీసీ హక్కుల పరిరక్షణ కోసం బీసీ కమిషన్ పని చేస్తుందని కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. సమాజంలో వెనుకబడిన, బలహీనవర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ హక్కుల విషయంలో కమిషన్ ముక్కు సూటిగా వ్యవహరిస్తుందని చెప్పారు. బీసీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమగ్రకుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని, జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోరుకునే ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని సూచించారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 65 నుంచి 70 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. జిల్లాలో నిర్వహించిన బహిరంగ చర్చలో 72 పిటిషన్లు అందాయని వెల్లడించారు. జనాభా పరంగా రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ తొలగించాలని, ప్రమోషన్లలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కుమ్మరులకు చెరువు మట్టిని ఉచితంగా ఇవ్వాలని, ముదిరాజులు, కుమ్మరి, బట్రాజ్ తదితర కులాలను బీసీ డీ నుంచి ఏ జాబితాలోకి మార్చాలని, రజకులను ఎస్సీలుగా గుర్తించాలని, పిచ్చకుంట్లను పూర్తిగా ఆపేరుతో పిలవడం మానేసి వంశరాజ్‌గా మాత్రమే పిలవాలనే వినతులు అందినట్లు వివరించారు. సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి పాల్గొన్నారు.
బీసీలకు నిధులు కేటాయించండి
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వం బీసీ జనాభాకు దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని బీసీ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానపాటి ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా, బీసీ స్థితిగతుల అధ్యయనంలో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని మానపాటి ప్రదీప్‌కుమార్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీల కుల గణన సర్వేతో బీసీ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నాలుగు దశాబ్దాలుగా కార్పొరేట్ విధానం వ్యాపార రంగంలోని ప్రవేశించి గ్లోబలైజేషన్, ఇండస్ట్రియల్ పేరుతో కులవృత్తలను పూర్తిగా నాశనం చేసిందని అన్నారు. ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మేదరి కులస్తులు, వడ్రంగి, కుమ్మరి కులవృత్తుల వారు తమ వృత్తులకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. స్వర్ణకారులు, మత్స్యకారులు, గీత కార్మికులు, నాయీ బ్రాహ్మణులు కులవృత్తులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులవృత్తులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో కృష్ణాజీ, శ్రీధర్‌వర్మ, అశోక్, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment