వేగవంతం చేయండి
అనంతగిరి: జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రోజు ఎంత మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది.. ఇంకా ఎంత మేర వచ్చే అవకాశం ఉంది అనేదానిపై నివేదిక ఇవ్వాలన్నారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రవాణా చేసేందుకు లారీలను సమకూర్చుకోవాలని తెలి పారు. ఈ నెల 30న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రైతుల పండుగను విజయవంతం చేయాలని అన్నారు. రైతు రుణమాఫీ, సన్న రకం వడ్లకు బోనస్, రైతు సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు విజయలక్ష్మి, మోహన్‌బాబు పాల్గొన్నారు.
వసతులు కల్పించండి
ధారూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. ధారూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో నాగారం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. తేమ శాతం, తూకం వేసే విధానాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం తెచ్చేందుకు అవసరమైన గన్నీ బ్యాగులు ఇచ్చేలా కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరారు. తాగునీటి వసతి లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. స్పందించిన అదనపు కలెక్టర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ధారూరు పీఏసీఎస్ చైర్మన్ వై సత్యనారాయణరెడ్డి, డీఎస్‌ఓ మోహన్‌బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment