అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
బీపీఎం జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్
పరిగి: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బీపీఎం జిల్లా అధ్యక్షుడు గట్యానాయక్ అన్నారు. లగచర్ల ఫార్మా బాధితులకు అండగా మంగళవారం ఎల్‌హెచ్‌పీఎస్, బీపీఎం, బీఎంఎం ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను అరెస్టు చేసినా పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అక్రమంగా పేదల భూములను లాక్కుంటుంటే ఊరుకోమన్నారు. ఫార్మా భూ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. గిరిజనులు, ఎస్సీలు, బీసీలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ గద్దె దిగాలి
వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
పరిగి: కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రధాని మోదీ వెంటనే గద్దె దిగాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఆర్థిక విధానాలను అవలంబిస్తోందన్నారు. దీంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ప్రజా సంక్షేమం పట్టని ప్రధాని వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను తీసుకువచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు.
రోగులకు అందుబాటులో ఉండండి
జిల్లా వైద్యాధికారి వెంకటరవణ
దోమ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ సూచించారు. మంగళవారం దోమ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఓపీ, సిబ్బంది రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది సమ యపాలన పాటించాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అనంతరం సబ్ సెంటర్లు సిబ్బంది వివరాలపై మండల వైద్యాధికారి రజితను అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంలను
ట్యాంపరింగ్ చేయలేరు
అనంతగిరి: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)ను ట్యాంపరింగ్ చేయలేరని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసిందని, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై పిటిషనర్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని తెలిపారు.
గిరిజన నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment