అవగాహన అంతంతే..
‘పీఎంకేఎంవై’ గురించి తెలిసింది కొంతమంది రైతులకే..
దౌల్తాబాద్: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్‌ల గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. అయితే కేంద్ర పథకాల గురించి పెద్దగా తెలియడం లేదు. దీంతో వాటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వృద్ధాప్యంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని (పీఎంకేఎంవై) ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరిన రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పింఛను అందుతుంది. అయితే వయస్సు ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చాలా మందికి పీఎంకేఎంవై గురించి తెలియకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నారు.
జిల్లాలో 2.55లక్షల మంది రైతులు
జిల్లాలో 5.9లక్షల ఎకరాల వ్యవసాయ భూమి, 2.55 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి, వానాకాలం సీజన్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం పీఎంకేఎంవై ప్రారంభమైనా పథకం గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. 2021లో మాత్రం మొక్కుబడిగా అవగాహన కల్పించి చేతులు దులుపుకొన్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఈ పథకానికి ఎంత మంది రైతులు అర్హులు.. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు అనే వివరాలు కూడా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. పథకంపై అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
రూ.55తో ప్రీమియం ప్రారంభం
ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో చేరిన రైతులు నెలకు రూ.55 నుంచి ప్రీమియం కడుతూ రావాలి. గరిష్టంగా రూ.200 వరకు కట్టాల్సి రావొచ్చు. మీరు ఏ వయస్సులో పథకంలో చేరారనే అంశం ప్రతిపాదికన మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయస్సులోనే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 కడితే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వా త ప్రతి నెలా రూ.3వేలు పింఛను వస్తుంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. చిన్న, సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
పథకంలో చేరితే వృద్ధాప్యంలో రూ.3వేల పింఛను
అవగాహన లేక ప్రీమియం చెల్లించని వైనం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment