నేడు నగరానికి అంగన్‌వాడీ టీచర్లు
కొడంగల్ రూరల్: అంగన్‌వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని గురువారం హైదరాబాద్‌లో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య కోరారు. బుధవారం ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ సిబ్బంది ధర్నాకు వెళుతున్నట్లు వినతిపత్రం అందించారు. అంగన్‌వాడీ టీచర్లకు కనీసవేతనం రూ.18 వేలు అందించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాకు వెళుతున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు సన్మానం
కొడంగల్ రూరల్: ఇటీవల నూతనంగా ఎన్నికై న యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కృష్ణంరాజును బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. ఇరువురికి పార్టీ నాయకులు ఎస్‌ఎం.గౌసన్, సోమశేఖర్, వెంకటేష్, అహ్మద్‌ఖాన్, నర్సిములు శాలువాలు కప్పి సత్కరించారు.
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
ఆమనగల్లు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇండియా–1 ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఇండియా–1 ఏటీఎం సెంటర్‌లోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఏటీఎం సెంటర్‌లో ఉన్న మిషన్ సేఫ్ లాకర్‌ను విరగొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. విషయం తెలియడంతో బుధవారం ఉదయం ఏటీఎం సెంటర్‌ను ఎస్‌ఐ వెంకటేశ్, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు నుంచి కింద పడి
వ్యక్తి దుర్మరణం!
నందిగామ: రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని పారిశ్రామికవాడలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని హెచ్‌బీఎల్ రైల్వేగేట్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందకు జారిపడి దుర్మరణం చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి ఎడమ చేయిపైన ‘ప్రియాంక’ అనే పచ్చబొట్టు ఉందని, ఎరుపు రంగు టీషర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని తెలిపారు. తిమ్మాపూర్ స్టేషన్ మాస్టర్ రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment