అక్రమాలకు పాల్పడితే చర్యలు
తాండూరు రూరల్: పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు హెచ్చరించారు. ఆసరా పింఛన్ల పంపిణీపై సెర్ప్ అధికారుల బృందం బుధవారం తాండూరు మండలంలో తనిఖీలు నిర్వహించారు. సెర్ప్(పెన్షన్ స్కీం) డైరెక్టర్ గోపాల్‌రావు, ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్, డీపీఎం నర్సింలు, ఏపీఎం కమలాకర్ బృందం తాండూరు మండలం కొత్లాపూర్, బెల్కటూర్ గ్రామాల్లో పర్యటించింది. మండలంలో 6వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీఓ విశ్వప్రసాద్ అధికారుల బృందానికి తెలిపారు. ఆ తర్వాత బృందం సభ్యులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ప్రతి నెల పెన్షన్ అందుతోందా? ఏ తేదీలో ఇస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లకు సంబంధించి అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం జీపీలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎంత మందికి పింఛన్లు వస్తున్నాయి.. చనిపోయిన వారు పేర్లు తొలగించారా అని అడిగారు. బయోమెట్రిక్ సరిగ్గా పని చేయని సమయంలో పంచాయతీ కార్యదర్శి, పోస్ట్‌మెన్ సంయుక్తంగా అథెంటికేషన్ ద్వారా లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు ఇవ్వాలని సెర్ప్ అధికారుల బృందం ఆదేశించింది. కార్యక్రమంలో ఎంపీడీఓ విశ్వప్రసాద్, ఏపీఎం ఆనంద్, పంచాయతీ కార్యదర్శులు పార్వతమ్మ, బాలకృష్ణ పాల్గొన్నారు.
సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు
పింఛన్ల పంపిణీపై క్షేత్రస్థాయి పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment