భోజనంలో రాజీపడొద్దు
పరిగి: విద్యార్థులకు అందించే భోజనంలో రాజీపడొద్దని, నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. బుధవారం పరిగి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలె బాలికల గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి, వంట గదులను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న తీరును దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టళ్లకు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసే బియ్యం సరిగ్గా లేకుంటే వెనుక్కు పంపాలని ఆదేశించారు. బియ్యం సరిగ్గా లేకుంటేనే సమస్యలు వస్తాయన్నారు. రోజూ తాజా కూరగాయాలనే వాడాలని సూచించారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడొద్దని అన్నారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంట చేసే సమయంలో, వడ్డించే సమయంలో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంపీడీఓ కరీం, ప్రిన్సిపాల్ హరిత, ఉమా తదితరులు పాల్గొన్నారు.
అన్ని వసతులు ఉండాలి
బొంరాస్‌పేట: ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో అన్ని వసతులు ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మండలంలోని బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, అన్నం, పప్పు, కూరగాయలు, సరుకులు, వసతులను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులు ఆట స్థలం కావాలని కలెక్టర్‌ను కోరడంతో వెంటనే స్థలం కేటాయించాలని తహసీల్దారు ప్రభావతికి సూచించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యా ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకన్‌గౌడ్, హెచ్‌ఎం విక్రమ్‌సింగ్, వార్డెన్ రాజన్న పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం వడ్డించాలి
దౌల్తాబాద్: ప్రభుత్వ వసతి గృహాలు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి సూచించారు. బుధవారం మండలంలోని కస్తూర్బా విద్యాలయాన్ని పరిశీలించారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వంటలను పరిశీలించారు. వంట గదిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ గాయత్రి, ఎస్‌ఓ జ్యోతి తదితరులు ఉన్నారు.
బియ్యం సరిగ్గా లేకుంటే వెనక్కి పంపండి
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment