హాస్టళ్ల నిర్వహణలో అలసత్వం వద్దు
తాండూరు: ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఏ శరత్ హెచ్చరించారు. బుధవారం తాండూరు పట్టణం సాయిపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి తనిఖీ చేశారు. మంగళవారం అల్పాహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం వంటగది, స్టోర్ రూంను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజూ ఇలాంటి భోజనమే పెడుతున్నారా అని విద్యార్థులను అడగారు. ఈ రోజు భోజనం బాగుందని విద్యార్థులు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు 12 వేల హెచ్‌టూఎస్ టెస్ట్ వైల్ కొనుగోలు చేశామని తెలిపారు. వీటిని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. మంగళవారం అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ఇద్దరు ఇంకా కోలుకోలేదని.. హాస్టల్‌లోనే వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 13మంది ఆరోగ్యం బాగుందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ చందన, డీటీడీఓ కమలాకర్‌రెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్‌కుమార్
తాండూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు
పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment