హాస్టల్ వార్డెన్ అదృశ్యం
మొయినాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన హాస్టల్ వార్డెన్ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వసంత్‌రెడ్డి అదే గ్రామంలో ఉన్న స్వామినారాయణ్ గురుకుల పాఠశాల హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో అతని భార్య నవిత బుధవారం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఫార్మసిస్టులు నైపుణ్యం పెంచుకోవాలి
మొయినాబాద్‌రూరల్: ఫార్మసిస్టులు ప్రపంచంలోని ప్రజలందరికి ఉపయోగపడేలా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని అమ్డాపూర్ చౌరస్తాలో భాస్కర ఫార్మసీ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నాలుగు రోజుల పాటు కళాశాల కార్యదర్శి జె.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాలల నుంచి 30 మంది ఫార్మసిస్టులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అన్ని వృత్తి విద్యల్లో ఫార్మసీ కీలకమన్నారు. ఫార్మసిస్టులు ఆరోగ్య నిర్వహణలో ముఖ్య పాత్ర పోషిస్తారని సూచించారు. ఫార్మసీ విద్య వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు డాక్టర్ సుధీర్‌కుమార్, జె.బి.ఎడ్యూకేషన్ సొసైటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సంజయ్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన షురూ
సాక్షి, సిటీబ్యూరో: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొదలైంది. ఈమేరకు ప్రజాపాలనలో గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లోని 150 వార్డుల నుంచి 10,40,537 మంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లోని 8 వార్డుల నుంచి 29,909.. మొత్తంగా 10,70,446 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు సర్వేయర్లు, మానిటరింగ్, సూపర్‌వైజింగ్ ఆఫీసర్లను జీహెచ్‌ఎంసీ నియమించింది. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు ప్రతి వార్డుకు ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున 150 వార్డులకు సర్వేయర్లను నియమించారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,00,822 దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా సంగారెడ్డిలో 20,711 అప్లికేషన్లు వచ్చాయి. మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment