ఆటలు సరే.. వసతులేవి?
కుల్కచర్ల: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ‘సీఎం కప్’ పోటీల నిర్వహణ. కనీసం క్రీడాకారులకు మధ్యాహ్న భోజనం పెట్టడానికి సైతం నిధులు విడుదల చేయని దుస్థితి నెలకొంది. కుల్కచర్ల మండలంలో బుధవారం ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా మండల పరిధిలోని బండవెల్కిచర్ల గురుకుల పాఠశాలలో వివిధ పోటీలను నిర్వహించారు. కాగ ఇందులో పాల్గొన్న క్రీడాకారులకు తాగేందుకు కనీసం మంచినీరు సైతం ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. భావిభారత క్రీడాకారులుగా పేర్కొంటున్నప్పటికీ కనీసం తాగునీరు, భోజనం అందించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. సీఎం కప్ క్రీడల నిర్వహణకు రూ.15వేలు మంజూరైనట్లు ఎంపీడీఓ రామకృష్ణ పేర్కొనగా.. అవి కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన బాల్స్, నెట్స్ వంటివి కొనుగోలు చేయడానికి సరిపోయినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం సమయంలో కేవలం కొందరికే సరిపోగా మళ్లీ స్థానికంగా ఉన్న పాఠశాల నుంచి భోజనం తీసుకొచ్చారు. సీఎం కప్ అంటూ జిల్లా స్థాయి అధికారులు గొప్పగా చెప్పుకొంటున్నా.. నిధులు విడుదల చేయకపోవడంతో స్థానికంగా పలువురు రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. క్రీడాకారులకు వెలికితీసేందుకు విరివిగా నిధులు విడుదల చేయాల్సిన అధికారగణం ఇలా నిరుపేద క్రీడాకారుల భవిష్యత్తును అపహాస్యం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా క్రీడల అభ్యున్నతికి అధికారులు అధిక నిధులు విడుదల చేసి క్రీడాకారుల అభ్యున్నతికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
నిధులలేమితో సీఎం కప్ నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment