ప్రగతి పథంలో దుద్యాల్
మండల అభివృద్ధిపైసీఎం ప్రత్యేక దృష్టి ● పారిశ్రామికవాడ ఏర్పాటుకు కసరత్తు ● వేగంగా రోడ్డు విస్తరణ పనులు ● పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు ● హకీంపేట్‌కు జూనియర్, ఐటీఐకళాశాలలు, ప్రజా వైద్యశాల మంజూరు ● హర్షం వ్యక్తం చేస్తున్న మండలవాసులు
దుద్యాల్: అభివృద్ధిలో దుద్యాల్ మండలం పరుగులు పెడుతోంది. కొడంగల్ తరహాలో ఈ మండలాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారు. రెండేళ్ల క్రితం మండల కేంద్రంగా ఏర్పాటైనా ఎలాంటి పురోగతి సాధించలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు నోచుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే రేవంత్ సీఎం కావడంతో మండల దశ మారిపోయింది. అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయి. గ్రామీణ రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. మండల శివారు గ్రామమైన కుదురుమల్ల నుంచి దుద్యాల్ మీదుగా పోలేపల్లి శివారు వరకు రూ.50 కోట్లతో.. అలాగే దుద్యాల్ నుంచి సాగారం తండా, హంసంపల్లి, లింగాయపల్లి మీదుగా అంతర్రాష్ట్ర రహదారి హైదరాబాద్ వరకు రూ.28 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం
మండలంలోని హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల, రోటిబండ తండా, పులిచర్లకుంట తండా గ్రామాల్లో కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం భూములు సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. హకీంపేట్‌కు చెందిన 118 మంది రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులకు అంగీకార పత్రాలు కూడా అందజేశారు. త్వరలోనే పారిశ్రామకవాడ ఏర్పాటుకు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మండలంలో పరిశ్రమలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు, యువకులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. వేగంగా అభివృద్ధి జరగడంతోపాటు భూముల రేట్లు భారీగా పెరుగుతాయి.
కళాశాలలు, ఆస్పత్రి మంజూరు
మండలంలోని హకీంపేట్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల తోపాటు ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేసింది. జూనియర్, ఐటీఐ కళాశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దీంతో మండల వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహాలు
కొత్తగా ఏర్పాటైన మండల కేంద్రంలో అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అన్ని శాఖ లు ఒకే చోట ఉండేలా మండల సమీకృత భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రైతువేదిక సమీపంలో గల ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నారు. నూతన భవనం నిర్మించేంత వరకు తాత్కాలికంగా పల్లె దవాఖానాలో ఠాణ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఏర్పాట్లను పరిశీలించారు. రెండేళ్ల క్రితం 21 గ్రామ పంచాయతీలతో దుద్యాల్‌ను రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేశారు. ఇటీవల మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
చురుగ్గా సాగుతున్న దుద్యాల్ – హకీంపేట్‌రోడ్డు విస్తరణ పనులు
అన్ని రంగాల్లో అభివృద్ధి
నూతనంగా ఏర్పడిన మండలాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీస వసతులు కూడా కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. కొడంగల్ తరహాలో దుద్యాల్ మండలాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు.
– ఆకారం వేణుగోపాల్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, దుద్యాల్
Comments
Please login to add a commentAdd a comment