మారని పరిస్థితి!
వికారాబాద్: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా తయారయ్యాయి. హాస్టళ్లలో పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. సంబంధిత శాఖల హెచ్‌ఓడీలు పర్యవేక్షణను గాలికి వదిలేయడంతో వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిసారీ ఏదో ఒక హాస్టల్‌లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల్లో చేరడం సర్వసాధారణమయ్యింది. విద్యార్థులు ఏడాదంతా సమస్యలతో సహవాసం చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలైన నాటి నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. ఆగస్టులో నస్కల్ కేజీబీవీలో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా సెప్టెంబర్‌లో మరో రెండు వసతి గృహాల్లో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. గతంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి బాలుర వసతి గృహంలో విద్యార్థులు కళ్ల పసకలతో ఆస్పత్రిలో చేరగా.. బూర్గుపల్లి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు విష జ్వరాలతో ఆస్పత్రి బాట పట్టారు. తాజాగా తాండూరు ఎస్టీ బాలికల వసతి గృహంలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రి బెడ్ ఎక్కారు. గత వారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ జిల్లా ఉన్నతాధికారులకు హాస్టళ్లు, స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల హెచ్‌ఓడీలను మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించారు. వారంలో రెండు స్కూళ్లు, హాస్టళ్లు సందర్శించాలని ఆదేశించారు. ప్రతి చోట పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. అయినా పరిస్థితి మారడంలేదు.
తూతూమంత్రంగా మెనూ
ఓ పక్క ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సన్న బియ్యంతో అన్నం, రకరకాల కూరగాయలతో వంటలు చేసి భోజనం పెడుతున్నామని చెబుతుండగా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇటీవలే భోజనం, కాస్మొటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. మెనూ కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నా దాన్ని ఫాలో అయిన పాపానపోవడం లేదు. చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మంచి భోజనం పెట్టమని అడిగితే వార్డెన్ తిడుతున్నారని చౌడాపూర్ మండలంలోని విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన కూడా గతంలో చోటుచేసుకుంది.
పర్యవేక్షణ గాలికి..
వసతి గృహాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించకపోవడంతో వార్డెన్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సోషల్ వెల్ఫేర్, బీసీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, సీ్త్ర శిశు సంక్షేమం, గురుకుల, కేజీబీవీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లు కలిపి ఒక్కో శాఖలో 20 నుంచి 25 హాస్టళ్లు ఉండగా వంద పైచిలుకు సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఉద్యోగ విరమణ పొందగా ఆ బాధ్యతలు యువజన విభాగం, క్రీడల శాఖ జిల్లా అధికారికి అప్పగించారు. ఇక గురుకులాలను పర్యవేక్షించే ఆర్‌సీఓలు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లటం తప్ప వారికి సమస్యలు పట్టడంలేదు. ఫుడ్‌పాయిజన్, సమస్యలపై విద్యార్థులు ధర్నాలు, ఆందోళన బాట పట్టే వరకు ఉన్నతాధికారులు హాస్టళ్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై దృష్టి సారించాలని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
అధ్వానంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు
తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు
ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థులు
అయినా మారని అధికారుల తీరు
ఘటనలు జరిగినప్పుడు హడావుడి
ఆ తర్వాత షరామామూలే..
Comments
Please login to add a commentAdd a comment