అమిత్‌షాపై చర్యలు తీసుకోవాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
పరిగి: బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వ్యవసాయ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికార మదమెక్కి అడ్డగోలుగా మాట్లాడిన అమిత్‌షాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి పదవిలో ఉండి అంబేడ్కర్‌పై ఇలా మాట్లాడటం సరికాదన్నారు. భారత ప్రజలతో పూజింపబడే అంబేడ్కర్‌ను చిన్న చూపు మాటలతో మాట్లడటం నీతిమాలిన చర్య అన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనునాయక్, సత్తయ్య, శేఖర్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
హోంమంత్రి వాఖ్యలు ఇబ్బందికరం
కుల్కచర్ల: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్‌పై అమిత్‌షా వాఖ్యలు ఇబ్బందికరమని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేష్ అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా అంబేడ్కర్‌ను అవమానపర్చే విధంగా వాఖ్యలు చేయడం వారి అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, ప్రభు, గాంగ్యనాయక్, లక్ష్మణ్, జంగయ్య, భరత్, ఇబ్రహిం, జాంగీర్, నాసిం, బాల్‌రాజ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో..
తాండూరు టౌన్: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని తాండూరు మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం స్థానిక అంబేడ్కర్ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు రాములు, బలరాం, నర్సింలు, రవి, కిష్టప్ప, మనోహర్, భాను, రాజు పాల్గొన్నారు.
సీఐటీయూ ఖండన
అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. చట్ట సభల సాక్షిగా బీజేపీ వైఖరి అణగారిన వర్గాలపై ఎలా ఉందో బహిర్గతమైందన్నారు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన
అనంతగిరి: బీఆర్ అంబేడ్కర్‌పై పార్లమెంట్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మల్లికార్జున్, శివ, శేఖర్, రాజు, సత్యం, నర్సింలు, గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment