ఆగని సమ్మె.. సాగని చదువు
కరోనా సంక్షోభం అనంతరం గాడిన పడుతున్న విద్యావ్యవస్థలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కస్తూర్బాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, పాఠశాలలను పర్యవేక్షించే సీఆర్పీలు సమ్మెలోకి వెళ్లడంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించింది. దీని ప్రభావంపది, ఇంటర్మీడియట్ విద్యార్థులపై పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కుల్కచర్ల: సమగ్ర శిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు చేస్తున్న సమ్మె విద్యార్థుల పాలిట శాపంగా మారింది. గత 11 రోజుల నుంచి వారి సమస్యలను పరిష్కరించాలని సామూహికంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుల్కచర్ల మండల పరిధిలోని సమగ్ర శిక్ష ఉద్యోగులతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ వికారాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను పర్యవేక్షించేందుకు పనిచేసే సీఆర్పీలు, కేజీబీవీలో ఇంటర్మీడియట్ వరకు బోధించే ఉపాధ్యాయులు, పాఠశాలలకు సమాచారం అందించే మెసెంజర్‌లు, పాఠశాలల జీతాలు, తదితర ఆన్‌లైన్ కార్యక్రమాలు నిర్వహించే కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులందరూ సమ్మె బాట పట్టడంతో క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు బియ్యం సరఫరా చేయడానికి సీఆర్పీలు సమ్మెలో ఉండటంతో ఎంఈఓలు బాధ్యత తీసుకుని ప్రతి పాఠశాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు.
పరీక్షల సమయం
జిల్లాలో 19 మండలాల్లో 19 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో 728 ఉపాధ్యాయులు ఉండగా వారంద రూ ప్రస్తుతంలో సమ్మెలో ఉన్నారు. ఉదాహరణకు కుల్కచర్ల మండల పరిధిలోని కేజీబీవీలో 18 మంది ఉపాధ్యాయులు సమ్మెలోకి వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేకుండా పోయారు. అలా జిల్లా పరిధిలో ఉన్న కేజీబీవీలో ఉపాధ్యాయులందరూ సమ్మెలోకి వెళ్లడంతో పాఠ్యాంశాలు పూర్తికాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. మార్చి మొదటి వారంలోనే ప్రారంభమవుతాయి. అప్పటివరకు అయినా సిలబస్ పూర్తి అవుతుందా కాదా అని విద్యార్థులు మానసిన వేదన అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం విద్యార్థులకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
11 రోజుల నుంచి సమ్మెలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు
ముంచుకొస్తున్న పరీక్షలతోఆందోళనలో విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment