పైకొచ్చిన పాతాళ గంగ
తాండూరు: మూడేళ్లుగా పాతాళ గంగమ్మ కరుణిస్తోంది. బోరు బావుల కింద సాగు చేపట్టే యాసంగి పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. దీంతో బావులు, బోరుబావులు రీచార్జ్ అయ్యాయి. భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నవంబర్ 17 నుంచి 26 వరకు భూగర్భ జలాల నమోదు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని 77 భూగర్భ జలాల నమోదు కేంద్రాల(ీఫీజో మీటర్) ద్వారా ఎంత లోతులో జలాలున్నాయనే వివరాలు పరిశీలించి రికార్డు చేశారు. గతేడాది నవంబర్‌లో 8.46 ఫీజో మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా.. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో 7.02 ఫీజో మీటర్ల లోతులో జలాలున్నట్లు అధికారులు ధృవీకరించారు. గతేడాదిలో పోల్చుకుంటే ఈ సీజన్‌లో 1.44 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయి.
సాధారణం కంటే అధిక వర్షపాతం
వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు 623.6 మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా భారీగా కురిసిన వర్షాలకు 877.8 మి.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. బోరుబావుల నుంచి పంటలకు సమృద్ధిగా నీరందుతుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భూగర్భ జలాల వివరాలు
మండలం పెరిగిన నీటి మట్టం
(ఫీజో మీటర్లలో)
కొడంగల్ 4.94
పూడూరు 5.27
మోమిన్‌పేట 6.01
వికారాబాద్ 6.13
బంట్వారం 6.55
కుల్కచర్ల 7.78
బొంరాస్‌పేట్ 7.11
పెద్దేముల్ 12.17
ధారూరు 13.84
పరిగి 15.32
మర్పల్లి 16.58
దుద్యాల 17.56
భారీ వర్షాల కారణంగా భూగర్భజలాలు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఏ ఏడాది మరింత తక్కువ లోతులోనే నీరు లభిస్తోంది. దీంతో సాగుకు సరిపడా నీరందుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
7.02 మీటర్ల పైకి చేరిన భూగర్భజలాలు
గతేడాదితో పొలిస్తే 1.44 మీటర్ల అధికం
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
వర్షపు నీటిని ఒడిసిపట్టాలి
నవంబర్‌లో జిల్లాలో భూగర్భ జలాల వివరాలు సేకరించాం. జిల్లా వ్యాప్తంగా సగటున 7.02 ఫిజోమీటర్ల భూగర్భజలాలు నమోదయ్యాయి. గతేడాదితో పొలిస్తే ఈ నెలలో 1.44 మీటర్ల వరకు భూగర్భ జలాలు పైకి చేరుకున్నాయి. దుద్యాల, పరిగి, మర్పల్లి, పెద్దేముల్ మండలాల్లో వాటర్ లెవల్స్ కొంత తగ్గాయి. భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, కందకాలు, ఫాంపండ్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీటిని వృథా చేయకుండా ఒడిసి పట్టినప్పుడే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది.
– రవిశంకర్, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment