రేపు కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్
అనంతగిరి: 50వ అంతర్‌జిల్లా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆదివారం క్రీడాకారుల ఎంపిక ఉంటుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరుశురాంనాయక్, కార్యదర్శి వినోద్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సెలక్షన్స్ పూడూర్ మండలం ఎన్కెపల్లి గేట్ సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 20 సంవత్సరాలలోపు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 9701225929 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కాలుష్యరహిత
పట్టణంగా పరిగి
అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషితో పరిగి మున్సిపాలిటీ కాలుష్య రహిత పట్టణంగా మారిందని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. మున్సిపాలిటీలో సుల్తాన్‌పూర్, నస్కల్, రుక్కుంపల్లి, సయ్యాద్‌మల్కాపూర్, షాకాపూర్, నజీరాబాద్ తండాలను మున్సిపల్‌లో విలీనం చేసిన సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో విండ్ పవర్, సోలార్‌లతో విద్యుత్ వినియోగిస్తున్నామని చెప్పారు.
కోట్‌పల్లి ఎస్‌ఐగా
అబ్దుల్ గఫార్
బంట్వారం: కోట్‌పల్లి ఎస్‌ఐగా అబ్దుల్ గఫార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్‌ఐ స్రవంతి ఎస్పీ ఆఫీసుకు వెళ్లగా డీసీఆర్బీ నుంచి అబ్దుల్ గఫార్ కోట్‌పల్లి పీఎస్‌కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గఫార్ ఎస్పీ నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య
అనంతగిరి: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగానే కేటీఆర్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. ఫార్ములావన్ కారు నిర్వహణపై అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన చివరకు న్యాయమే గెలుస్తుందని, మా నాయకుడు మచ్చలేని మకుటంలా ఉన్న వ్యక్తి అని కొనియాడారు.
కన్హాలో ముగిసిన జాతీయ సమైక్యతా సమ్మేళనం
నందిగామ: మండల పరిధిలోని కన్హా శాంతివనంలో నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా సమ్మేళనం 2024–25 కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వికసిత్ భారత్, మహిళా సాధికారత, భారతదేశ సాంస్కృతిక వారసత్వం అనే అంశాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. శాసీ్త్రయ, జానపద సంగీతంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన కళలు, నృత్యాలు ప్రదర్శించారు. ఈ సమ్మేళనంలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు నవోదయ విద్యాలయ సమితి జాయింట్ సెక్రటరీ జ్ఞానేంద్ర కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ సమితి ఉప సంచాలకుడు గోపాలకృష్ణ, వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment