అభివృద్ధి పనులకు శంకుస్థాపన నేడు
కొడంగల్: నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నారు. జిల్లా అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కొడంగల్‌లో బీసీ గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులకు భూమి పూజ, దుద్యాల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయానికి శంకుస్థాపన, తాత్కాలిక భవనంలో దుద్యాల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం, హకీంపేటలో జూనియర్ కళాశాల, హైస్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ, హకీంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం, కోస్గిలో అండర్ 19 నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్ విజేతలకు బహుమతులను ప్రదానం చేయనున్నారు.
డాలర్స్ హిల్స్‌లో కొండచిలువ కలకలం
మణికొండ: నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ప్రహరీలోకి కొండ చిలువ రావటంతో కార్మికులు భయాంకు గురయ్యారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్స్‌హిల్స్ కాలనీలో డాక్టర్ అవినాష్ నూతన ఇంటి నిర్మాణం చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 అడుగుల కొండ చిలువ ప్రహరీ గోడ లోపలికి వచ్చింది. ఓ మూలన ఉన్న డస్ట్ బిన్ పక్కన చేరి బుసలు కొట్టింది. అటుగా వెళ్లిన వారు దాన్ని గమనించి యజమానికి తెలిపారు. దీంతో ఆయన స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సంచిలో దానిని బంధించారు. కొండచిలువను జూపార్క్‌లో అప్పగిస్తామని తెలిపారు.
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థిని
చేవెళ్ల: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలో ఉన్న వివేకానంద ఇంటర్‌నేషనల్ స్కూల్‌కు చెందిన విద్యార్థిని హుదా ఫాతిమా జూనియర్ మినీ రోల్‌బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైంది. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే యాదయ్యను స్కూల్ యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు మార్యదపూర్వకంగా కలిశారు. ఆరో తరగతి చదువుతున్న హుదా ఫాతిమా ఇటీవల శంషాబాద్‌లో జరిగిన జూనియర్ మినీ రోల్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల చైర్మన్ నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కర్రె శివప్రసాద్, మాజీ సర్పంచ్ జహంగీర్, విద్యార్థిని తల్లిదండ్రులు పాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment