‘శాశ్వత’ పరిష్కారం!
● అద్దె భవనంలో ‘పట్నం’సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ● సొంత భవనం నిర్మించాలని ప్రభుత్వ నిర్ణయం ● స్థల అన్వేషణ పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు
ఇబ్రహీంపట్నం: క్రయవిక్రయదారులు.. ఏజెంట్లు.. డ్యాక్యుమెంట్ రైటర్లతో నిత్యం కళకళలాడుతూ కాసుల వర్షం కురిపించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవన నిర్మాణాలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కార్యాలయాల పరిధిలో స్థల అన్వేషణ మొదలు పెట్టింది. ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చిపెట్టే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలా వాటికి సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లో.. ఇరుకు గదుల్లో.. అరకొర సౌకర్యాల మధ్య సిబ్బంది కార్యాకాలపాలు కొనసాగిస్తున్నారు. కార్యాలయానికి వివిధ వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ చేసేందుకు సైతం స్థలం కరువైంది. రోడ్లపైనే నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పడిన నాటి నుంచి అద్దె భవనంలోనే కొనసాగుతోంది. మున్సిపల్ స్థలంలో కొత్తగా ఒక కాంప్లెక్స్‌ను నిర్మించి, ఆ భవనంలోకి కార్యాలయాన్ని మార్చాలని అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భావించారు. ఇందుకు అనుగుణంగా పాత బస్టాండ్ వద్ద కాంప్లెక్స్ భవన పనులు ప్రారంభించారు. స్లాబ్‌వరకు నిర్మాణం జరిగిన తర్వాత నిధులు లేక అర్ధంతరంగా ఆగిపోయాయి.
రెండు చోట్ల ప్రతిపాదనలు
కాంగ్రెస్ ప్రభుత్వం అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మూడు దశల్లో శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఇబ్రహీంపట్నం కార్యాలయానికి స్థల అన్వేషణ చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో మంగల్‌పల్లి రెవెన్యూ పరిధి బొంగుళూర్ సమీపంలో 84 సర్వే నంబర్‌లోని 35 గుంటలు, ఖానాపూర్ సమీపంలో 320 సర్వేనంబర్‌లోని ఆరు ఎకరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. 320 సర్వే నంబర్‌లోని భూమి గతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నిర్మాణానికి కేటాయించినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో ఖాళీగానే ఉంది. ఈ భూమిని తిరిగి తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయించాల్సి ఉంటుంది. శాశ్వత భవనాన్ని నిర్మిస్తే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి, అక్కడికి నిత్యం వచ్చేవారికి తిప్పలు తప్పినట్లే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శాశ్వతంగా నూతన భవన నిర్మాణానికి స్థల అన్వేషణ జరుగుతోందని తహసీల్దార్ సునీతరెడ్డి, సబ్ రిజిస్ట్రార్ సోని తెలిపారు. మండలంలోని రెండు చోట్ల ఖాళీ స్థలాలకు సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్‌కు పంపినట్లు వివరించారు. ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని ప్రభుత్వ భూమిలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment