కలగా ఇంటిగ్రేటెడ్
2021లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శంకుస్థాపన
● నాలుగేళ్లు కావస్తున్నా అసంపూర్తిగానే.. ● ఒక్కో భవన నిర్మాణానికి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లు మంజూరు ● కొడంగల్, తాండూరు మున్సిపాలిటీల్లో ప్రారంభం కాని పనులు ● వికారాబాద్, పరిగిలో పిల్లర్ల దశలో.. ● బిల్లులు మంజూరు కాకపోవడమే కారణం
వికారాబాద్: జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మా ణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. శంకుస్థాపన చేసి నాలుగేళ్లు కావస్తున్నా పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. ప్రజలకు అన్ని రకాల సరుకులు, కూరగాయలు, పూలు, పండ్లు, ఆకుకూరలు, చేపలు, మాంసం, చికెన్ ఒకేచోట లభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ నిర్మించాలని భావించింది. జిల్లాలోని కొడంగల్, పరిగి మున్సిపాలిటీల్లో రెండు ఎకరాలు, వికారాబాద్, తాండూరు మున్సిపాలిటీల్లో ఆరు ఎకరాల చొప్పున స్థలం కేటాయించారు. 2021లో టెండరు ప్రక్రియ పూర్తి చేశారు. ఆ వెంటనే పనులకు శంకుస్థాపన చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్‌కు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీల్లో శంకుస్థాపన చేసి వదిలేశారు. వికారాబాద్, పరిగి పట్టణాల్లో పనులు ప్రారంభించినా ముందుకు సాగడం లేదు. ఈ రెండు చోట్ల పిల్లర్ దశలోనే పనులు ఆగిపోయాయి.
బిల్లులు రాకపోవడంతో..
కార్పొరేట్ షాపింగ్ మాల్స్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభు త్వం భావించింది. అధునాతన భవన సముదా యం నిర్మించి అక్కడే అన్ని రకాల కూరగాయలు, సరుకులు, చికెన్, మటన్, పూలు, పండ్లు లభించేలా షాపింగ్ మాల్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్లు భవన సముదాయా న్ని రూపకల్పన చేశారు. గ్రౌండ్, ఫ్లస్ట్ ఫ్లోర్లలో షాపులు కట్టాలని నిర్ణయించారు. పనులు మంజూరైనా బిల్లులు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలో ఆపేశి వెళ్లిపోయారు. ప్రస్తుతం పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల్లో పిల్లర్ దశలో దర్శనమిస్తున్నాయి. నాలుగేళ్లుగా పనులు ఆగిపోవడంతో ప్రజాధనం నిరుపయోగంగా మారింది.
అందుబాటులోకి వస్తే..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. అంతేకాకుండా సరుకుల కోసం వేర్వేరు ప్రాంతాలకు పరిగెత్తాల్సిన పని ఉండదు. అన్ని సరుకులు ఒకేచోట లభిస్తే సమయం కూడా కలిసొస్తుంది. సరుకుల ధరలు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న సమీకృత మార్కెట్లును వెంటనే అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment