ఆలయ విస్తరణ దిశగా అడుగులు
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ పట్టణం బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆలయాన్ని విస్తరించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి భావిస్తోంది.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీవారి ఆలయాన్ని ఐఏఎస్ అధికారి శ్రీనివాసరాజుతోపాటు తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్తలతో పాటు అధికారులు, పట్టణ ప్రజలతో సమీక్షించారు. ఆలయంలో తీసుకోవాల్సిన పనుల గురించి చర్చించారు. ఆలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, మాడ వీధుల విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికి పునరావసం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పురోహితుడు ధరూర్ శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment