రూ.59 కోట్ల పత్తి కొనుగోళ్లు
మోమిన్‌పేట: స్థానిక అయ్యప్ప కాటన్ మిల్లులో గత శుక్రవారం వరకు సీసీఐ ద్వారా రూ.59 కోట్ల విలువైన పత్తిని కొనుగోళ్లు చేశారు. 2,479 మంది రైతుల నుంచి 80,343 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా రూ.59 కోట్ల 68 లక్షలు చెల్లించాల్సి ఉంది. తద్వారా మర్పల్లి మార్కెట్‌కు ఒక శాతం ఫీజు కింద రూ.60 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ నెల చివరి వరకు కొనుగోళ్లు చేస్తే మరింత ఆదాయం వస్తుందని మార్కెట్ సిబ్బంది రఘు తెలిపారు.
పోలెపల్లిలో భూ సర్వే
దుద్యాల్: మండలంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూముల సేకరణకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పోలెపల్లిలో భూ సర్వే ప్రక్రియ చేపట్టింది. తహసీల్దార్ కిషన్ దగ్గరుండి పర్యవేక్షించారు. గ్రామ సర్వే నంబర్ 67లో ఉన్న 71.39 ఎకరాల అసైండ్ భూములకు సంబంధించి సర్వే చేశారు. పట్టాదారు కలిగి ఉన్న సర్వే నంబర్ ఆధారంగా భూమి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పట్టాదారు పొజిషన్‌లో ఉన్నాడా..? అనే విషయాన్ని సర్వే ఆధారంగా హద్దులు గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం హకీంపేట్‌లో 351 ఎకరాలకు సంబంధించి సర్వే ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్ వీరేశ్ బాబు, ఆర్‌ఐ నవీన్, సర్వేయర్లు మహేశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో తాండూరు –
వికారాబాద్ రోడ్డు పనులు
ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి
తాండూరు రూరల్: త్వరలో తాండూరు – వికారాబాద్ ప్రధాన రహదారి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఖాంజాపూర్ గేటు వద్ద రోడ్డు పనులకు సంబంధించి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు – వికారాబాద్ రోడ్డు విస్తరణ పనులకు రూ.49కోట్ల 78లక్షలు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్క్‌ంగ్ పనులు జరుగుతున్నట్లు వివరించారు. తాండూరు పట్టణంలోని శ్రీనివాస రైస్‌మిల్లు నుంచి రైల్వే బిడ్జి వరకు సీసీ రోడ్డు, గౌతపూర్ ప్రధాన చౌరస్తా నుంచి అల్లాపూర్ వరకు సీసీరోడ్డు వేయనున్నట్లు చెప్పారు. మర్పల్లి నుంచి కోట్‌పల్లికి రూ.42 కోట్లతో రోడ్డు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈ శ్రవణ్‌కుమార్, కాంట్రాక్టర్లు హన్మంత్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి ఉన్నారు.
ప్రజావాణికి 120 అర్జీలు
అనంతగిరి: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 120 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు)సుధీర్, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జైలుకు సురేష్
అనంతగిరి: లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో ఏ–2గా ఉన్న సురేష్ కస్టడీ సోమవారంతో ముగియడంతో సాయంత్రం సంగారెడ్డి జైలుకు తరలించారు. మూడు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వికారాబాద్‌లో విచారణ చేపట్టారు. ఘటన జరిగినప్పటి నుంచి సురేష్ పాత్రపై విచారణ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment