ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
నవాబుపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లదో ప్రసవాల సంఖ్యను పెంచాలని వైద్యాశాఖ అధికారులను కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి.. మరమ్మతు పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామన్నారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నవాబుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.
గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
అనంతరం మండల పరిధిలోని వట్టిమీనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే, పులుమామిడిలో చేపట్టిన రైతు భరోసా సర్వేను క్షేత్రస్థాయిల పరిశీలించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. వట్టిమీనపల్లి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం సరఫరా చేయాలని సూచించారు. ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌ఓ వెంకటరవణ, తహసీల్దార్ జైరాం, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయాధికారి జ్యోతి, మండల వైద్యాధికారి రోహిత్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
మోడల్ ఆస్పత్రిగా నవాబుపేట పీహెచ్‌సీ
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment