పారదర్శకత ప్రశ్నార్థకం
వికారాబాద్: మరో నాలుగు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి 24వరకు గ్రామ సభలు ఏర్పాటు చేసి తుదిజాబితాకు ఆమోదం తెలపాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ ప్రతీక్‌జైన్ వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డు కమిటీల వారిగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల సాయంతో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎక్కువగా కాంగ్రెస్ నేతలే ఉన్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకత ఏ మేరకు పాటిస్తారనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా 15వేల ఇళ్లు
ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 4.5లక్షల ఇళ్లను నిర్మించాలని భావిస్తోంది. ఇందులో మొదటి విడతలో నియోజకవర్గానికి 3వేల నుంచి 3,500 వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 వేల నుంచి 15 వేల ఇళ్లు నిర్మించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
అధికారులు, ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యంతో లబ్ధిదారుల ఎంపిక
లబ్ధిదారుల ఎంపికలో అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం ఉండాలని నిర్ణయించారు. కమిటీల్లో చైర్మన్‌గా సర్పంచ్లు, కన్వీనర్లుగా పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు స్వయం సహాయక సంఘాల సభ్యులు, ముగ్గురు గ్రామస్తులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ ఒక్కొకరి చొప్పున), మరో ఇద్దరు ఇతర సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం సర్పంచ్‌లు లేనందున వారి స్థానంలో ప్రత్యేక అధికారులు ఉంటారు. కాగా కమిటీల ఏర్పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా నిబంధనల ప్రకారం కమిటీల ఏర్పాటు జరగలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, లేదా పార్టీ ఇన్‌చార్జిల కనుసన్నల్లోనే కమిటీలు వేశారు. వారు కమిటీల్లో ఎవరి పేర్లు నామినేట్ చేసి ఇస్తే వారినే కమిటీ సభ్యులుగా అధికారులు నమోదు చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 20 రెవెన్యూ మండలాలు ఉండగా 18 మండల పరిషత్‌లు ఉన్నాయి. మండల పరిషత్‌ల ఆధారంగా ప్రస్తుతం కమిటీల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటి వరకు 18 మండలాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు పూర్తయింది. జిల్లాలో మొత్తం 585 గ్రామ పంచాయతీలు ఉండగా వీటితో పాటు మున్సిపల్ వార్డుల్లోనూ ఇందిరమ్మ కమిటీల ప్రక్రియ పూర్తి చేశారు. కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం విధివిధానాలు రూపొందించినప్పటికీ ఎమ్మెల్యేలు, మండల కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన పేర్లతోనే కమిటీలు ఏర్పాటయ్యాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఏ మేరకు ఉంటుంది.. నిజమైన పేదలకు లబ్ది చేకూరేనా..? అనే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment