హామీల అమలులో విఫలం
● కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నేతలు ● షాబాద్‌లో బీఆర్‌ఎస్ రైతు దీక్ష ● ఆద్యంతం ఉత్సాహం నింపినప్రసంగాలు ● తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ● పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం
షాబాద్: మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్ష విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. జేసీబీ వాహనాలతో గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అక్రమాలను ఎండగట్టారు. నేతల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.
స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి
రైతులను ఆగం చేస్తున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సబితారెడ్డి సూచించారు. కేసీఆర్ హయాంలో వర్షా లు పడే సమయానికి ఏడాదికి రెండుసార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేసే వారని గుర్తు చేశారు. ఫోన్లలో టింగ్‌టింగ్‌మని శబ్దం వచ్చేదన్నారు. రైతులను, మహిళలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం
రైతులకు రుణమాఫీ, రైతుబంధు, 24 గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రైతులు, మహిళలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. కేటీఆర్‌ను జైలుకు పంపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను తిప్పికొడతామని చెప్పారు.
దృష్టిని మరల్చేందుకే అక్రమ కేసులు
కేటీఆర్ కృషి ఫలితంగానే ఈ కార్ రేస్ మన రాష్ట్రానికి వచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఈకార్ రేస్‌లో పెట్టుబడులు పెట్టడంతో రాష్ట్రానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.700 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కాంగ్రెస్ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు అమలు చేయకపోవడంతో ఎక్కడ తమను నిలదీస్తారనే భయంతో.. వారి దృష్టిని మరల్చేందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు.
అసత్య ప్రచారం సిగ్గుచేటు
తెలంగాణలో ఇచ్చిన హామీలను గంగలో కలిపిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేసినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దుయ్యబట్టారు. గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు విషపు ఆహారంతో అల్లాడినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఉచిత కరెంటు ఇవ్వలేదని, గ్యాస్ సబ్సిడీ లేదని, నెలకు రూ.2,500, కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇవ్వడం లేదని విమర్శించారు.
హామీల అమలులో విఫలం
షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేతలు కార్తీక్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, కృష్ణా రెడ్డి, నాగేందర్‌గౌడ్, ఆంజనేయులు, స్వప్న, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు పాల్గొన్నారు.
కక్ష సాధింపు చర్యలు
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. లగచర్ల రైతులకు మద్దతుగా నిలబడినందుకు తనను 35 రోజులు, రైతులను సంగారెడ్డి జైలులో పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. రైతుభరోసా రూ.15వేలకు బదులు రూ.12వేలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment