తూకం.. మోసం!
● రాళ్లే కొలమానంగా.. ● వినియోగదారులకు తప్పని బాధలు ● ఎలక్ట్రానిక్ కాంటాల్లోనూ ఇదే పరిస్థితి
పరిగి: కిరాణా దుకాణాల్లోని కొన్ని వస్తువులపై ఎమ్మార్పీ, తయారీ, ఎక్స్‌ఫైరీ తేదీలు, నెట్ వెయిట్ వివరాలు లేకుండానే విక్రయిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నాణ్యత పరిశీలించేందుకు ఉపయోగించే ఫిల్టర్ పేపర్‌ను అందుబాటులో ఉంచడం లేదు. వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ముద్రలే ని తూకం రాళ్లు, తూకాల్లో తేడా ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా చాలా షాపుల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయినా తూనికలు కొలతల శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నష్టపోతున్న వినియోగదారులు
జిల్లాలోని కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, పంట కొనుగోలు కేంద్రాల్లో త్రాసు, ఎలక్రానిక్ వేయింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు వినియోగించే బాట్లు, ఎలక్ట్రానిక్ కాంటాలకు లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేసి రెండేళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేయాలి. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించాలి. అయితే జిల్లాలో ఎక్కడా ఈ పద్థతి అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిరాణా దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో వ్యాపారం చేసేవారు ఒక్కో కిలోకు 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు తూకంలో మోసాలకు పాల్పడుతున్నారు. ముద్ర లేని బాట్లు, తూకం మిషన్లను వినియోగిస్తున్నారు. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు.
ఎలక్ట్రానిక్ కాంటాలతో కుచ్చుటోపీ
చాలా చోట్ల వ్యాపారులు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను వినియోగిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. వేయింగ్ మిషన్లకు మెట్రాలజీ అధికారులు నుంచి లైసెన్సు పొందాలి. వాటికి వేసిన సీల్‌ను తొలగించరాదు. దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, బాట్లను అందుబాటులో ఉంచాలి. వినియోగదారులకు అనుమానం వస్తే బాట్లతో తూకం చూపించాలి. వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాంటా సామర్థ్యంలో పదిశాతం మేరకు బాట్లు అందుబాటులో ఉండాలి. జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. తుకాల్లో హెచ్చుతగ్గులు రావడానికి వ్యపారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీల్ లేని వేయింగ మిషిన్లను వినియోగిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
జిల్లాలోని పలు మండలాలు, పట్టణాల్లో ప్యాక్ చేసిన పదార్థాలను విక్రయిస్తున్నారు.. కానీ వాటిపై తయారీ తేదీ, గడువు తేదీ, ధర వివరాలు ఉండటం లేదు. పాడైన, ముక్క వాసన వస్తున్న వాటిని కూడా విక్రయించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పదార్థాలు, తూకాల్లో మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
కిరణా దుకాణాలు, పెట్రో ల్ బంకుల్లో నిబంధనలు పాటించడం లేదు. తూకా ల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సంతల్లో కూడా రాళ్లతో తూకం వేస్తున్నారు. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టి తూకాల్లో మోసాలను అరికట్టాలి.
– మల్లేశ్, మిట్టకోడూర్
Comments
Please login to add a commentAdd a comment