పనుల్లో నాణ్యత ఉండాలి
కొడంగల్: రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని.. ప్రజా అవసరాలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పట్టణంలోని కడా కార్యాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణాలు చేపట్టే క్రమంలో సంబంధిత శాఖల ఇంజనీర్లు తనిఖీలు చేయాలన్నారు. పనులు చేసే క్రమంలో నీటి సరఫరా పైప్‌లైన్, విద్యుత్ స్తంభాలు మార్చేందుకు అయ్యే ఖర్చులకు నివేదికలు తయారు చేయాలన్నారు. నీటి సరఫరా చేసే పైపులపై రోడ్డు నిర్మాణం చేపట్టరాదని సూచించారు. పనులను హడాహుడిగా కాకుండా పకడ్బందీగా చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలను ముందస్తుగా తొలగించుకొని పనులు చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతంలో వేసే రోడ్ల గురించి ఉన్నతాధికారులతో చర్చించాలన్నారు. కడా ఆధ్వర్యంలో చేపట్టిన పనులను మంజూరు చేసినప్పటికీ గ్రౌండింగ్ కాని పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ నీలవతి, మిషన్ భగీరథ ఎస్‌ఈ జగన్మోహన్, జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ డీఈలు, ఈఈలు పాల్గొన్నారు.
రెండ్రోజుల్లో సర్వే పూర్తి కావాలి
అనంతగిరి: నాలుగు ప్రతిష్టాత్మక పథకాల అమలు కోసం చేపట్టిన సర్వే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్లతో మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం పనిచేయాలన్నారు. రైతు భరోసాకు సాగులో ఉన్న భూముల వివరాలు వ్యవసాయానికి అనువుగా లేని భూములు అలాగే నాలాలు, కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, ప్రభుత్వం ప్రాజెక్టులు కొరకు తీసుకున్న భూముల వివరాలను ఎలాంటి పొరపాటుకు తావులేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు.. ఫామ్ ప్లాట్స్, ఫామ్ హౌస్‌లను గుర్తించి సర్టిఫికెట్ ఇవ్వాలని, సర్వేలో ఏమైనా సమస్య వస్తుందా వస్తే కారణాలను రాయాలని సూచించారు. సర్వే ప్రక్రియను 20వ తేదీ నాటికి పూర్తి చేసి 21 నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించి అర్హుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సర్వే, గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, డీపీఓ జయసుధ, డీఎస్‌ఓ మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ ప్రతీక్ జైన్
Comments
Please login to add a commentAdd a comment