దేవుళ్లపై ఒట్లు కాదు..
● సీఎం నోట మాటవస్తే శాసనం కావాలి
● జోక్స్ కారాదు
● ఇచ్చిన హామీల్లో అర శాతమే అమలు
● మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
నవాబుపేట: దేవుళ్ల మీద ఒట్లు వేయడం కాదు.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసి మాటమీద నిలబడాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. బుధవారం నవాబుపేటలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆమె పాల్గొన్నారు. రైతులు, మహిళలతో మాట్లాడారు. రుణమాఫీ అయ్యిందా..? అడ బిడ్డలకు రూ.2,500 వస్తున్నాయా..?, పింఛన్లు ఇచ్చారా, రైతు భరోసా సాయం అందిందా..? అని అడిగారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని పలువురు సబితారెడ్డి దృష్టికి తెచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నోట ఏదైనా మాట వస్తే అది శాసనం కావాలని, జీవోల రూపంలో రావాలని.. జోకులు కారాదని హితవు పలికారు. ఆరు గ్యారంటీల్లో అర శాతమే అమలు చేశారని, మిగతావాటికి మంగళం పాడారని విమర్శించారు. కేవలం 25 శాతమే రైతు రుణమాఫీ అయ్యిందని.. ఈ విషయాన్ని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసిన పాపానికి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారని తెలిపారు. పంట పెట్టుబడి సాయం అందక అప్పులు చేస్తున్నారని అన్నారు. రుణమాఫీ విషయం దేవుడెరుగు.. బ్యాంకర్లు రైతుల ముక్కు పిండి వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పేదలు, రైతుల పక్షపాతి అని.. జనం కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకునే వారు కాదన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం మెడలు వంచి పేదలు, రైతులకు మేలు జరిగేలా చూస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దాకా ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చేదీ లేదన్నారు. బీఆర్‌ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే అన్నారు. వారి కోసమే తమ పోరాటమన్నారు. అంతకుమందు పార్టీ రాష్ట్ర నాయకులు కార్తీక్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, విజయ్‌కుమార్, ఆంజనేయులు, భరత్‌రెడ్డి, దాస్‌గౌడ్, శాంతకుమార్, భీంరావ్, రాజు, మాణిక్‌రెడ్డి, వెంకటయ్య తదిరతులు పాల్గొన్నారు.
రైతులతో మాట్లాడుతున్న సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment