ముగ్గురి నుంచి రూ.2.83 లక్షలు కాజేసిన నిందితులు
అల్లిపురం: ‘ఆరోగ్య శ్రీ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు రావాల్సిన డబ్బులు చెల్లించడానికి కొంత ఆన్‌లైన్ ప్రాసెస్ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మేము పంపించిన లింక్ క్లిక్ చేస్తే నగదు మీ ఖాతాకు జమ అవుతుంది.’అంటూ ఫోన్లు చేసి నగదు కాజే సిన ముఠాను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. నగరానికి చెందిన ఒక మహిళకు 85060 59581 నంబర్‌తో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆరోగ్యశ్రీ విభాగానికి చెందిన వ్యక్తిగా అతను పరిచయం చేసుకుని.. మీ కోడలు డెలీవరీ ఖర్చులకు సంబంధించి డబ్బులు జమ చేస్తామని చెప్పాడు. ఇందు కోసం ఒక లింక్ పంపాడు. ఆ లింక్‌ను ఉపయోగించి బ్యాలెన్స్ తనిఖీ చేయమని ఆమెను కోరాడు. ఆమె ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతా నుంచి రూ.26,211 కట్ అయినట్లు మేసేజ్ వచ్చింది. ఫోన్ పే యాప్ నుంచి మరోసారి బాధితురాలు చెక్ చేసుకుంటే రూ.51,201 కట్ అయినట్లు మరో మేసేజ్ వచ్చింది. ఈ మొత్తం సొమ్మును తిరిగి జమ చేస్తామని నిందితుడు మరోసారి యూపీఐని చెక్ చేసుకోమని లింక్ పంపాడు. ఈ క్రమంలో రూ.6,831 కట్ అయింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆమెలాగే పెద్ద నడుపూరుకి చెందిన ఎన్ని శశికళ ఖాతా నుంచి రూ.99,342, మద్దిలపాలేనికి చెందిన బోయి దివ్వ ఖాతా నుంచి రూ.99,430లను కేటుగాళ్లు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వీర్నాల బాలాజీ, పూజల చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment