పంచేసుకున్నారు
జిల్లా మొత్తం వచ్చిన షాపులు దరఖాస్తులు విశాఖ 155 3,890 అనకాపల్లి 136 3,214 అల్లూరి 40 1,179 మొత్తం 331 8,283 సమకూరిన ఆదాయం : రూ.165.66 కోట్లు
విశాఖ సిటీ : కూటమి ప్రజాప్రతినిధులు లిక్కర్ షాపులు పంచేసుకున్నారు. ఆయా నియోజక వర్గాల్లో వారి అనుచరులతోనే దరఖాస్తులు చేయించారు. పేరుకు ఆన్‌లైన్ దరఖాస్తుల విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ..ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే దరఖాస్తుల సమర్పణ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. మూడు రోజుల క్రితం వరకు ఒక్కో వైన్‌షాప్‌కు రెండు, మూడు దరఖాస్తులు మాత్రమే రావడంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో ప్రజాప్రతినిధులు అప్పటికప్పడు పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సి వచ్చింది. అనుచరగణాన్ని రంగంలోకి దింపి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. దీంతో సగటున విశాఖ జిల్లాలో ఒక్కో వైన్‌షాప్‌కు 25, అనకాపల్లిలో 23, అల్లూరి జిల్లాలో ఒక్కో దుకాణానికి 29 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తు రుసుం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ.165.66 కోట్లు ఆదాయం సమకూరింది.
ఉమ్మడి విశాఖకు 8,283 దరఖాస్తులు
ఉమ్మడి విశాఖకు సంబంధించి మొత్తం 331 షాపులకు ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో విశాఖ జిల్లాకు 155, అనకాపల్లికి 136, అల్లూరి జిల్లాకు 40 షాపులు కేటాయించారు. పది రోజులుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. వాస్తవానికి ముందు నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 9వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 11వ తేదీ వరకు గడువు పొడిగించింది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే ఇంకా 70 మంది వరకు డీడీలు చెల్లించాల్సి ఉంది. వీరికి టోకెన్లు అందించి రాత్రి 11.15 గంటలలోగా డీడీలు చెల్లించే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ప్రక్రియ ముగిసే సమయానికి విశాఖ జిల్లాకు 3,890 దరఖాస్తులు వచ్చాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో దుకాణాలకు 3,214, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,179 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి సమక్షంలో విశాఖ జిల్లా షాపులకు లాటరీ విధానంలో షాపులను కేటాయించనున్నారు.
దరఖాస్తుల సమర్పణకు ముగిసిన గడువు
కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే దుకాణాలకు దరఖాస్తులు
ఈసారి ఒడిశా నుంచి లిక్కర్ కింగ్‌ను దింపిన ప్రజాప్రతినిధులు
కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..
గత ఐదేళ్లు ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడంతో కూటమి నేతల ఆదాయానికి గండి పడింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నూతన మద్యం పాలసీ పేరుతో మళ్లీ వైన్‌షాపులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో కూటమి ప్రజాప్రతినిధులు మద్యం సిండికేట్లను రంగంలోకి దింపారు. అయితే 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యే ఒక సిండికేట్‌లో వాటాలు ఉండడంతో జిల్లా అంతటా ఆయన హవా నడిచింది. కానీ ఈసారి సదరు ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు సొంత పార్టీలోనే మరో కీలక ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. దీంతో సిండికేట్ల మధ్య కూడా కొంత మేర చీలికలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే ఏకంగా ఒడిశా నుంచి ఒక లిక్కర్ కింగ్‌ను విశాఖ మద్యం వ్యాపారంలోకి దింపినట్లు చర్చ జరుగుతోంది. ఈసారి ఆన్‌లైన్ ద్వారా ఒడిశా నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే వెనకుండి ఒడిశాలో లిక్కర్ వ్యాపారాన్ని శాసిస్తున్న వారిని విశాఖకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సిండికేట్లలోనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాలో వైన్‌షాపుల కేటాయింపు విషయంలో కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొనడంతో నియోజకవర్గాల వారీగా పంచుకోవాలని చివరి నిమిషంలో ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం నియోజకవర్గాల వారీగా షాపులను తమ సిండికేట్లతో పాటు తమ అనుచర గణానికి దక్కేలా వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా బయటి వ్యక్తులు లాటరీ ద్వారా షాపు దక్కించుకున్న వారు కూడా తప్పనిసరిగా సిండికేట్‌లో చేరేలా ఒత్తిడి చేసి దారికి తెచ్చుకునేలా చేయాలని ఇప్పటికే ఎకై ్సజ్ అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలు సైతం జారీ చేసినట్లు తెలిసింది. అలాగే మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం, గాజువాక, పెందుర్తి, భీమిలిలో ఇప్పటికే సిండికేట్లు వైన్‌షాపుల కోసం లీజులు సైతం చెల్లించడం విశేషం. దీనికి ఆయా సర్కిళ్ల పరిధిలో ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment