డ్రాపౌట్ లెక్క తేల్చిన విద్యాశాఖ
విశాఖ విద్య: జిల్లాలో బడి బయట ఉన్న పిల్లల లెక్క తేలిందని విద్యాశాఖాధికారులు వెల్లడించారు. జిల్లాలో 2,402 మంది బడి ఈడు పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. వీరంతా డ్రాపౌట్‌గా ఉన్నారని, వీరిని స్కూళ్లలో చేర్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని డీఈవో ఎల్. చంద్రకళ తెలిపారు. ‘భావితరం..బడికి దూరం’ అనే శీర్షిక ఈ నెల 10న సాక్షి లో ప్రచురితమైన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విద్యార్థులు చేరిన పాఠశాలల్లో యు డైస్ ప్లస్ నందు నమోదు కానందునే వారంతా డ్రాప్ బాక్స్‌లో 7 వేల మంది కనిపిస్తున్నారన్నారు. కొంతమంది విద్యార్థులు వేరే జిల్లాలు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయారని వెల్లడించారు. బడి బయట పిల్లల గుర్తింపుకు సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అయితే,విద్యా హక్కు చట్టం మేరకు 6–14 ఏళ్ల గల వారు తప్పనిసరిగా బడిలో ఉండాలి. కానీ జిల్లాలోని 11 మండలాల్లో 2,402 మంది బడి నుంచి దూరమైపోవటం ఒకింత ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణాలు అందరికీ విద్య అనే నినాదానికి తూట్లు పొడిచేవేనని విద్యా వేత్తలు అంటున్నారు. వేలాది మంది బడి ఈడు పిల్లలు డ్రాపౌట్‌గా మిగిలిపోవటం, అధికారుల పనితీరును ఎత్తుచూపుతోంది. డ్రాప్ అవుట్‌గా తేలిన వారంతా అసలు ఎక్కడ ఉన్నారు..? వారిని సాధ్యమైనంత త్వరలో గుర్తించి, స్కూళ్లలో చేర్పించకపోతో, బాల కార్మికులుగా మగ్గిపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు దీనిపై సీరియస్‌గా తీసుకుంటేనే బడి బయట ఉన్న వారికి చదువులు చేరువవుతాయని బాలల హక్కుల పరిరక్షణ కోసమని పనిచేసే సంస్థల ప్రతినిధులు అంటున్నారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో 2,402 మంది బడి బయటే..
Comments
Please login to add a commentAdd a comment