ప్రజల పక్షాన నిలబడిన సాయిబాబాను చంపేశారు
పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలక చంద్రశేఖర్
సీతంపేట: ప్రజల పక్షాన నిలబడినందుకే ప్రొఫెసర్ సాయిబాబాను కేంద్రంలోని మనువాద ప్రభుత్వం చంపేసిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలక చంద్రశేఖర్ ఆరోపించారు. పౌర ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఆచార్య సాయిబాబా స్మృతి సదస్సు జరిగింది. ముందుగా సాయిబాబా చిత్రపటానికి నివాళులర్పించారు. ఆపరేషన్ కగార్ అంశంపై చంద్రశేఖర్ ప్రసంగిస్తూ ప్రజల పక్షాన నిలబడిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని, దానికి సాయిబాబా బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో పదో తరగతి అర్హత ఉన్న వారికి ప్రభుత్వమే తుపాకులు అందజేసి గిరిజనులకు అండగా నిలిచిన వారిపై కాల్పులు చేయిస్తోందని విమర్శించారు. మోదీ, అమిత్‌షా వచ్చిన తర్వాత ఉప చట్టాన్ని మరింత కఠినతరం చేసి హక్కుల నేతల గొంతు నొక్కేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే చట్టాలు తీసుకువచ్చి సాయిబాబాను పదేళ్లు జైల్లో ఉంచి చంపేశారన్నారు. హైదరాబాద్ సల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీ ‘మూడు క్రిమినల్ చట్టాలు’అనే అంశంపై మాట్లాడారు. సాయిబాబా విడుదల కోసం చట్టప్రకారం పోరాటం చేసిన ఇద్దరు ప్రొఫెసర్లు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. ఏడాదికి 74 లక్షల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయని, సుమారు 6 లక్షల మంది అరెస్ట్ అవుతున్నారన్నారు. భారతీయ జైళ్లలో 88 శాతం మంది దిగువ వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. విరసం నేత కృష్ణ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలోని చిన్న గ్రామంలో సాయిబాబా జన్మించారని, హక్కుల మేధావిని మావోయిస్టుగా ముద్రవేసి జైలుకి పంపారన్నారు. మహిళా న్యాయవాది పద్మ మాట్లాడుతూ సాయిబాబాను హత్య చేసేంత వరకు పాలకులు నిద్రపోలేదన్నారు. మార్క్సిస్ట్ అధ్యయన కేంద్రం కన్వీనర్ జె.వి.సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, డాక్టర్ కొల్లా రాజమోహన్, భారత నాస్తిక సమాజం టి.శ్రీరామమూర్తి, ఇప్టూ వెంకటేశ్వర్లు, పలు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment