పుస్తకాలకు దగ్గరగా.. సోషల్ మీడియాకు దూరంగా..
గ్రంథాలయ వారోత్సవాల ముగింపులోజేసీ మయూర్ అశోక్ పిలుపు
డాబాగార్డెన్స్: విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగానికి, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, పుస్తకాలకు దగ్గర కావాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. సూర్యాబాగ్‌లోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా పుస్తకాలకు సాటి కాదన్నారు. మహనీయుల జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలు నెలకు ఒకటైనా చదవాలని హితవు పలికారు. అంబేడ్కర్ వంటి మహనీయులు రోజుకు 18 గంటల కంటే ఎక్కువ సమయం పుస్తక పఠనానికే కేటాయించేవారని గుర్తు చేశారు. వివిధ సందర్భాల్లో నిర్వహించే పోటీల్లో విద్యార్థులు తప్పకుండా పాల్గొనాలని, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం..
గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన 42 మంది వివిధ పాఠశాలల విద్యార్థులకు జేసీ బహుమతులు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌సీహెచ్ వెంకట్రావు, వయోజన విద్యా శాఖ డీడీ చిన్ని కృష్ణ, డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, డివిజనల్ పీఆర్వో నారాయణరావు, ఎంఈవోలు పైడంనాయుడు, పుష్యరాగం, లైబ్రేరియన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment