నేటి నుంచి వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్
బీచ్‌రోడ్డు : లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులోని హవామహల్ వేదికగా శని, ఆదివారాల్లో వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్–2024 జరగనుంది. సిరిపురంలోని ఒక హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు ప్రియా ఉప్పలపాటి, సంధ్యా గోడే, సానాల్ సరా ఈ వివరాలు వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్‌లో ప్రపంచంలోని 19 మంది ప్రముఖ స్టోరీ టెల్లర్స్ పాల్గొంటున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ సుమారు 44 సెషన్లు ఉంటాయని, 4 నుంచి 16 ఏళ్ల వయసు గల విద్యార్థుల కోసం ఎక్కువ సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆనందించే సెషన్లు కూడా ఉన్నట్లు చెప్పారు. తొలిసారిగా ఈ ఫెస్ట్‌ను ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ భాషాల్లో కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫెస్ట్‌కు ఇప్పటికే 2 వేల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వేదిక వద్ద కూడా పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ కథా రచయిత్రి బొంగిస్సా వారి సాంస్కృతికి చెందిన గీతాన్ని ఆలపించారు. పేజెస్ బుక్ ఎండీ సునీల్ నెవాటియ మాట్లాడుతూ ఇది గొప్ప కార్యక్రమమని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment