నాడు ప్రమాదం.. నేడు ప్రమోదం
కూటమి నేతల కుట్ర ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించే ప్రతి ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవే ప్రాజెక్ట్‌లు అద్భుతమని బాకాలు ఊదుకుంటున్నారు. అందుకు ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటే నిదర్శనం. పర్యాటకులకు సాగర కెరటాల సయ్యాటల అనుభూతిని పంచేందుకు సబ్‌మైరెన్ మ్యూజియం ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుకు వీఎంఆర్డీఏ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సమయంలో కూటమి నేతలు ఆ బిడ్జిపై విష ప్రచారం చేశారు. విశాఖ సాగరతీరం ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌కు అనుకూలం కాదని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఇపుడు అదే ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రమాదకరమైన, కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండే రుషికొండ బీచ్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారుల బృందం ఆ ప్రాంతాన్ని సైతం సందర్శించింది. నాడు ప్రమాదకరమైన ప్రాజెక్టు.. ఇప్పుడు ఆహ్లాదకరంగా ఎలా మారిందన్న ప్రశ్న సర్వత్రా ఉత్పన్నమవుతోంది. 2019లో అధికారం కోల్పోయిన చంద్రబాబు, అతని టీం విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. అమరావతికి ముప్పువాటిల్లుతోందన్న భయంతో విశాఖ చేపట్టే ప్రతి ప్రాజెక్టును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసింది. పర్యాటక ప్రాజెక్టుల విషయంలో కూడా ఏదో సాకుతో కోర్టులో కేసులు వేయిస్తూ.. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ వచ్చింది. తాజాగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment