లక్ష్యాలు చేరుకోని ఏఈలకు మెమోలు
మహారాణిపేట: కాంట్రాక్టర్లు, అధికారులు సమష్టి కృషి చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రోజుకు 100 నుంచి 150 నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమావేశంలో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు. లేఅవుట్ల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో కాంట్రాక్టర్లతో శతశాతం పని చేయించాలని, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు, లేఅవుట్ ఇన్చార్జిలు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయి అధికారులకు తగిన సహకారం అందించాలని సూచించారు. సమావేశంలో భాగంగా కొంత మంది ఏఈలు, ప్రత్యేక అధికారులు ఆయా లేవుట్ల స్థాయిలో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదించాలని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పీడీ ఆళ్ల శ్రీనివాస్‌ను ఆదేశించారు. పూర్తి స్థాయిలో సహకారం అందించని కాంట్రాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని, అప్పటికీ సహకరించకపోతే నిబంధనల ప్రకారం చర్యలకు చేపట్టాలని స్పష్టం చేశారు. లక్ష్యాలు చేరుకోవడంలో అధికారులు, సిబ్బంది విఫలమైతే ఏఈలకు మెమోలు జారీ చేస్తానని, మూడు తప్పులు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈఈ, డీఈలు, మండల ప్రత్యేక అధికారులు, ఏఈలు పాల్గొన్నారు.
గృహ నిర్మాణ శాఖ సమీక్షలో కలెక్టర్ హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment