పోలీసుల మానవత్వం
డాబాగార్డెన్స్: నగర పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించడంతో పాటు మానవత్వం చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఒకరిని ఆదుకున్నారు. వివరాలివీ.. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన గురుంజి బెంగళూరులో పని చేస్తున్న తన భార్యను చూసేందుకు ఈ నెల 11న రైలులో బయలుదేరాడు. రైలు విశాఖపట్నం చేరుకోగానే.. ఏదైనా తిందామని రైలు దిగాడు. ఇంతలో అతను ప్రయాణిస్తున్న రైలు వెళ్లిపోయింది. ఆ సమయంలో వేరే రైలు లేకపోవడంతో అతన్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. చికిత్స కోసం అక్కడి పోలీసులు అతన్ని కేజీహెచ్‌కు తరలించారు. ఆ సమయంలో కానిస్టేబుల్ నానాజీ అతని భార్య ఫోన్ నంబర్ సేకరించారు. కాగా.. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురుంజి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆమెకు తెలియజేయడంతో.. ఆమె వెంటనే బెంగళూరు నుంచి విశాఖ చేరుకున్నారు. తన భర్త కోసం పోలీసుల సహాయంతో వెతకడం ప్రారంభించారు. నాలుగు రోజులైన అతని ఆచూకీ లభించలేదు. సోమవారం కొత్తరోడ్డు జంక్షన్‌లో వన్‌టౌన్ పోలీసులు అతన్ని గుర్తించారు. ఆకలితో అలమటిస్తున్న గురుంజికి అన్నం పెట్టారు. కొత్త దుస్తులు కొనిచ్చారు. గురుంజిని వన్‌టౌన్ సీఐ దేముడుబాబు ఆమెకు అప్పగించి.. రైలు టికెట్ ఖర్చులిచ్చి పశ్చిమబెంగాల్ పంపారు. తన భర్తను అప్పగించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment