కేసులు73
రూ.89.33 లక్షలు
విశాఖ సిటీ: నేర రహిత సమాజం కష్టమని.. కానీ నేరాల నియంత్రణ, నిందితులను పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోలీస్ సమావేశ మందిరంలో మంగళవారం రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్‌లో నగరంలో 73 చోరీ కేసులను ఛేదించి 87 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి నుంచి రూ.45,83,385 విలువ చేసే బంగారం, వెండి, నగదు, బైక్‌లు, కార్, ఆటో, ల్యాప్‌టాప్, ప్రింటర్‌లను, రూ.43.5 లక్షలు విలువ చేసే 290 సెల్‌ఫోన్లను మొత్తంగా రూ.89,33,385 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 1.1 కిలోల బంగారం, 4.61 కిలోల వెండి, రూ.3,50,820 నగదు, 21 బైక్‌లు, ఒక ఆటో, కార్, ప్రింటర్, 2 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. నేరాల నియంత్రణ కోసం నగరంలో ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యంతో 8 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే వీధుల్లో లైటింగ్ ఏర్పాటు, పెట్రోలింగ్ పార్టీలు, బీట్ సర్వీస్ పెంచడం, పొదలు లేకుండా చేయడంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందన్నారు. ఫలితంగా ప్రతి నెలా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు కేసుల ఛేదనలో కూడా పురోగతి ఉన్నట్లు వివరించారు. నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపడుతున్న చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. త్వరలో గేటెడ్ కమ్యూనిటీలతో సమావేశం ఏర్పాటు చేసి నేరాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కేసులను ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, నగదు, సెల్‌ఫోన్లు, బైక్‌లు, ఇతర సామగ్రిని బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైం) లతా మాధురి, ఏడీసీపీ(క్రైం) మోహనరావు, ఏసీపీ(క్రైం) లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
రికవరీ
87 మంది నేరగాళ్ల అరెస్ట్
1.1 కిలోల బంగారం, 4.61 కిలోల వెండి స్వాధీనం
రూ.3.5 లక్షల నగదు, 25 బైక్‌లు,ఒక ఆటో, కార్, 305 సెల్‌ఫోన్ల రికవరీ
రికవరీ మేళాలో బాధితులకు అందజేత
Comments
Please login to add a commentAdd a comment