సదస్సా?
అధికారులకు కుర్చీల్లేకుండా కూర్చున్న కూటమి నేతలు
● ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులతో నిండిపోయిన కలెక్టరేట్ ● సమస్యలు తెలిపేందుకు ఇబ్బందిపడిన రెవెన్యూ అధికారులు ● సదస్సుకు దూరంగా ఎమ్మెల్యే గంటా
సీసీఎల్‌ఏపై వెలగపూడి చిందులు
సాక్షి, విశాఖపట్నం: జరిగిందేమో ఉత్తరాంధ్ర జిల్లాల రెవెన్యూ సదస్సు.. సమావేశ మందిరంలో కనిపించిందేమో కూటమి పార్టీల దిగువస్థాయి నేతలు. అధికారులు కూర్చునేందుకు చోటు లేకపోయినా.. మేం బయటికి వెళ్లం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటే మేమూ అంటూ సదస్సు ఆద్యంతం ఉన్నారు. తామంతా రెవెన్యూ సదస్సుకు వచ్చామా.? కూటమి నేతల రాజకీయ సదస్సుకు వచ్చామా అనే సందేహంతోనే రెవెన్యూ అధికారులు రోజంతా కాన్ఫరెన్స్‌లో సర్దుకొని కూర్చున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్‌డీవోలతో కలెక్టరేట్ సమావేశమందిరంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ పరిధిలో సమస్యలు పరిష్కారం, భూముల రీ సర్వే, 22ఏ, ఫ్రీ హోల్డ్, గ్రామ సభలు, పీజీఆర్‌ఎస్.. తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. ఈ సదస్సుకు మంత్రులు, అధికారులతో పాటు ఆయా జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఇంకెవరూ ఆ సదస్సులో ఉండటానికి అర్హులు కారు. కానీ.. కాన్ఫరెన్స్‌లో అధికారులకు సైతం చోటు లేకుండా.. కూటమి పార్టీల నేతలతో హాల్ నిండిపోయింది. ఒకానొక సమయంలో ఆర్డీవోలకు చోటు లేకపోవడంతో.. మళ్లీ కుర్చీలు తెచ్చి సర్దుకోవాల్సి వచ్చింది.
ఇంత జరుగుతున్నా.. తమ అనుచరుల్ని బయటకు వెళ్లాలని మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ చెప్పలేదు. సమావేశానికి ఆహ్వానం లేని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, నామినేటెడ్ పోస్టు హోదాలో ఉన్న సీతంరాజు సుధాకర్, జనసేన చోటా నాయకుడు చంద్రరావు, బీజేపీ నేత శ్రీరామమూర్తి.. ఇలా దిగువ స్థాయి నేతలంతా హాల్‌లోనే ఆద్యంతం ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న వ్యవహారాలపై మాట్లాడుతుంటే.. చోటా నాయకులు మధ్యలో కలగజేసుకొని మాట్లాడుతుండటంతో అధికారులు అసహనం వ్యక్తం చేశారు. తమ పరిధిలో కూటమి నేతల వల్ల ఎదురవుతున్న సమస్యలు మంత్రి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా దృష్టికి తీసుకెళ్లాలని భావించినా.. జిల్లా, మండల స్థాయి నాయకులు సదస్సులో ఉండటంతో.. వారి వ్యవహారాలు బయటపెట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా రెవెన్యూ సదస్సును కూటమి నేతలు రాజకీయ సదస్సుగా మార్చేశారు. ఇదిలా ఉండగా.. కీలకమైన సదస్సుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డుమ్మా కొట్టారు. రెవెన్యూ విభాగంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతోనే గంటా గైర్హాజరైనట్లు కూటమి నేతలే చెబుతుండటం కొసమెరుపు.
రెవెన్యూ రాజకీయ
ఐఏఎస్‌పై పేపర్లు విసిరేసిన ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమైన మహిళా ఉన్నతాధికారి?
సాక్షి, విశాఖపట్నం: ఐఏఎస్ అధికారులంటే కూటమి ఎమ్మెల్యేలకు ఎంత చిన్నచూపో మరోసారి నిరూపితమైంది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు చిందులు తొక్కారు. సమావేశం ముగిసిన తర్వాత వినతులపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడు తమకు కేటాయించిన భూమి 22ఏ పరిధిలో ఉందని వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన సీసీఎల్‌ఏ జయలక్ష్మి, ‘మధ్యాహ్నం కూడా మీరు ఇదే సమస్య చెప్పారు. దానిని సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోమని కూడా చెప్పాను. పదే పదే ఎందుకు అడుగుతున్నారు?’అని అన్నారు. దీంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి శివాలెత్తిపోయారు. ‘మర్యాదగా మాట్లాడాలి కదా? ఎందుకలా మాట్లాడుతున్నారు?’ అంటూ ఆమైపె మండిపడ్డారు. దీనిపై ఆ మహిళా ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘కాదు ఎమ్మెల్యే గారు, మధ్యాహ్నం వినతి పత్రం తీసుకున్నప్పుడు, దానిపై చర్యలు తీసుకుంటానని చెప్పాను’ అని అన్నారు. అయినా వెలగపూడి శాంతించలేదు. ‘మీ ప్రభుత్వ అధికారులు ఇలాగే వ్యవహరిస్తారు. సరిగా మాట్లాడటం కూడా రాదు. మీలాంటి వారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది’అంటూ కేకలు వేస్తూ హడావుడి చేశారు. దీనిపై సీసీఎల్‌ఏ వెలగపూడితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయన అరుపులు, కేకలు వేస్తూ చేతిలో ఉన్న కాగితాలను ఆమెతోపాటు అధికారులపైకి విసిరేశారు. ‘సమస్యలపై స్పందించనప్పుడు రెవెన్యూ సదస్సులకు ఎమ్మెల్యేలను ఎందుకు పిలుస్తారు?’ అంటూ కేక లు వేసుకుని బయటకు వెళ్లిపోయారు. ఇందులో ఆమె తప్పేమీ లేకున్నా, అందరి ముందు ఆమెతో అమర్యాదగా వ్యవహరించడంతో సీసీఎల్‌ఏ కన్నీటి పర్యంతమయ్యారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment