విశాఖ
తొలి తెలుగు బైబిల్
@
● లండన్ మిషన్
మెమోరియల్ చర్చి వేదికగా...
● గ్రీకు భాష నుంచి తెలుగులోకి అనువాదం
● 1818లో మద్రాస్‌లో
రెండు భాగాలుగా ముద్రణ
● తొలి తెలుగు ప్రార్థన
కూడా వైజాగ్‌లోనే..
విశాఖ గ్రంథాన్నే ఎంపిక చేసిన బృందం
లండన్‌కు చెందిన బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ అనువాద గ్రంథాలను ముద్రించేందుకు సహకారం అందించేది. తెలుగులో అనువదించిన రెండు గ్రంథాలను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా(కలకత్తా ఆక్సిలరీ) ఆధ్వర్యంలో తెలుగు స్కాలర్స్ పరిశీలించారు. మను స్క్రిప్ట్ వెర్షన్‌లో అనువదించిన విశాఖ బైబిల్ గ్రంథాన్నే సొసైటీ ఎంపిక చేసింది. మద్రాస్‌లో 1818లో తొలి తెలుగు బైబిల్ గ్రంథాన్ని ఆది భాగం, అంత్యభాగం పేరుతో రెండు భాగాలుగా 2000 కాపీలు ముద్రించారు. అలాగే తొలి తెలుగ ప్రార్థనలు కూడా వన్‌టౌన్‌లోని లండన్ మిషన్ మెమోరియల్ చర్చిలోనే జరిగాయి.
కోల్‌కతా, వైజాగ్‌లో
ఏకకాలంలో..
18వ శతాబ్దంలో డానిష్ లూథరన్ మిషనరీకి చెందిన రెవరెండ్ బెంజిమన్ బైబిల్‌ను తొలిసారిగా తెలుగులో అనువదించారు. అయితే అప్పట్లో భారతదేశంలో ముద్రణా యంత్రాలు లేకపోవడంతో దానిని జర్మనీకి ముద్రణ కోసం పంపించారు. కానీ అది ముద్రణకు నోచుకోకపోవడంతో ఆయన అనువాద గ్రంథం కనుమరుగైంది. ఆ తర్వాత దేశంలో రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో బైబిల్ గ్రంథానువాదానికి శ్రీకారం చుట్టారు. బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ఆధ్వర్యంలో సెరంపూర్(కోల్‌కతా)లో రెవరెండ్ విలియం కేరీ అనువాదం ప్రారంభించారు. అదే సమయంలో లండన్ మిషనరీ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రెవరెండ్ అగస్టస్ డి.గ్రాంజెస్, రెవరెండ్ జార్జ్ క్రాన్ తెలుగు అనువాదం ప్రారంభించారు. వీరు ఆనందరాయ అనే తెలుగు వ్యక్తి సహకారం తీసుకున్నారు. అయితే గ్రంథం అనువాదం జరుగుతున్న సమయంలో గ్రాంజెస్, క్రాన్ మరణించారు. అనంతరం అనువాద బాధ్యతను ఎడ్వర్డ్ ప్రిచ్ఛెట్ తీసుకుని పూర్తి చేశారు. ఈ విధంగా ఒకేసారి కోల్‌కతా, విశాఖలో బైబిల్ తెలుగు అనువాద గ్రంథాల రచన పూర్తయింది.
ఇప్పటికీ ఈ బైబిలే ప్రామాణికం..
ప్రపంచంలో చాలా భాషల్లో ముద్రించిన బైబిల్ గ్రంథం తెలుగు అనువాదానికి విశాఖపట్నం వేదికగా నిలవడం గర్వకారణం. ఇటీవల చేసిన పరిశోధనల్లో తొలి గ్రంథం విశాఖలోనే అనువదించిన విషయం స్పష్టమైంది. 1818 బైబిల్ కొన్ని మార్పులకు గురైనా.. ఇప్పటికీ విశాఖలో అనువదించిన బైబిల్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
– ఎడ్వర్డ్ పాల్,
చరిత్ర అధ్యయనకారుడు
●
బెంగళూరులో భద్రంగా తొలి ముద్రణ
1818లో ముద్రించిన తొలి తెలుగు బైబిల్‌ను రెండు శతాబ్దాల తర్వాత లండన్ మిషనరీ మెమోరియల్ చర్చికి తిరిగి తీసుకొచ్చారు. 2005లో చర్చి ద్విశతాబ్ది ఉత్సవాలకు లండన్ నుంచి డిక్కర్ వచ్చారు. నెదర్లాండ్స్‌లో భద్రపరిచిన తెలుగు బైబిల్‌ను తీసుకొచ్చి చర్చికి బహుమతిగా ఇచ్చారు. ఆ పుస్తకం లెదర్ బైండింగ్‌తో ఉన్నప్పటికీ చాలా పాతది కావడంతో పేజీలు చాలా పెళుసుగా తయారయ్యాయి. పేజీ తిప్పితే పాడైపోయే స్థితిలో ఉన్న ఈ ప్రతిని సంరక్షించేందుకు బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కళాశాలకు పంపారు .
Comments
Please login to add a commentAdd a comment