అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ ఆందోళనలు
బీచ్‌రోడ్డు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తెలిపారు. సిరిపురంలోని తన కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళనలో భాగంగా జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ విభాగ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ 15,500 కోట్లు విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపడం దారుణమన్నారు. డిసెంబర్ నెలలో బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అన్నరీతిలో పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఓ పక్క విద్యుత్ చార్జీలు, మరోపక్క రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు కనిపిస్తోందన్నారు. ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు రెండింతలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఊసేలేదన్నారు. ప్రజలను మోసగించి ఆర్థిక భారాలు మోపుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రజల తరపున వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపడుతోందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
Comments
Please login to add a commentAdd a comment