చలికాలంలో విద్యుత్ వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పెరుగుతుండటంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సగటున యూనిట్ ధర రూ.3.21 ఉంటే .. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యూనిట్ ధరకు ఐదు రెట్లు అధికంగా వసూలు చేస్తోంది. దాదాపు 13 రకాల సుంకాలను వసూలు చేస్తూ యూనిట్ ధర రూ.15 వరకూ బాదేస్తోంది. బిల్లు చెల్లించడంలో కాస్తా జాప్యం జరిగినా.. అపరాధ రుసుముతో సహా బిల్లులు వసూలు చేయాలని డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేశాయి. సర్కారు దగాపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాగ్రహానికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రతీ నియోజకవర్గంలో విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనలు, ధర్నాలు గురువారం చేపట్టనుంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న విద్యుత్ కార్యాలయంలోని అధికారులకు విద్యుత్ చార్జీల పెంపును తక్షణమే రద్దు చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేతలు వినతిపత్రం అందజేస్తారు. అనంతరం అక్కడ నుంచి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వెళ్లి జిల్లా విద్యుత్ శాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఎదుట విద్యుత్ వినియోగదారులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన తెలియజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment