విశాఖ జ్యోతి.. జాతీయ కీర్తి
ఆమె పరుగు చిరుత వేగాన్ని తలపిస్తుంది. ట్రాక్‌లో దిగిందంటే ట్రెండ్ సెట్ చేయాల్సిందే. ఇది ఆమె ట్రాక్ రికార్డు చూస్తేనే తెలుస్తుంది. ఎటువంటి క్రీడా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. ఓ వైపు గాయాలు వెంటాడినా.. కరోనా సమయంలో పరుగుకు దూరమైనా నిరాశ చెందలేదు. పరుగును ఆపలేదు. అవరోధాల(హర్డిల్స్)ను అధిగమిస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా హర్డిలర్‌గా చరిత్ర లిఖించింది. ఒలింపిక్స్ క్రీడాకారులందరికీ ఒక కల. ఆ కలను నిజం చేస్తూ దేశంలోనే తొలి మహిళా హర్డిలర్‌గా ఖ్యాతి నార్జించింది. రెప్పపాటులో పతకం చేజారిపోయే అథ్లెటిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం ఒక ఎత్తు అయితే.. క్రీడాకారులకు అందించే అత్యున్నత అవార్డు ‘అర్జున’పొందడం గొప్ప విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఈ నెల 17న రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకోనుంది మన విశాఖ అమ్మాయి, అథ్లెట్ జ్యోతి యర్రాజీ. – విశాఖ స్పోర్ట్స్
జిల్లా
అథ్లెటిక్ సంఘం,
జిల్లా ఒలింపిక్
సంఘం
హర్షం
ఆర్థికంగా స్థిరమైన స్థితిలో లేకపోయినా.. జ్యోతి చిన్నప్పటి నుంచే ఆటల పట్ల ఆసక్తి పెంచుకుంది. జాతీయ స్థాయిలో రాణించాలని కలలుకంది. ఆమె తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డుగా, తల్లి ఇళ్లలో సహాయక పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. జ్యోతి పోర్టు ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆటల పట్ల ఆసక్తి కనబరిచింది. పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ప్రారంభించడంతో స్కూల్ గేమ్స్‌లోనే పతకం సాధించింది. తొలుత స్ప్రింట్‌లోని మూడు విభాగాల్లో పాల్గొనేది. ఆ తర్వాత రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ శిబిరంలో పాల్గొనడంతో జాతీయ స్థాయిలో పోటీపడింది. 2019లో గుంటూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరింది. అప్పటి వరకు జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ సమయంలో రిలయన్స్ పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో అథ్లెటిక్స్‌కు శిక్షణ ప్రారంభమవుతుందని తెలియడంతో దరఖాస్తు చేసుకుంది. అప్పటికే జాతీయ స్థాయిలో పతకం ఉండటంతో శిబిరంలో స్థానం సంపాదించింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. జాతీయ రికార్డులు నెలకొల్పడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధించడంతో జాతీయ మహిళా ఫాస్టెస్ట్ హర్డిలర్‌గా నిలిచింది. ఒకే ఏడాదిలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ ప్రపంచ ర్యాంకింగ్‌లో 24వ స్థానానికి చేరుకుని.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలిసారి ప్రపంచ మేటి వుమెన్ హర్డిలర్స్ పోటీని ఆస్వాదించింది. ప్రస్తుతం ముంబయిలో శిక్షణ శిబిరంలో ఉన్నానని, అర్జున అవార్డుకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని జ్యోతి ‘సాక్షి’తో చెప్పింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం, ఒలింపిక్స్‌లో పాల్గొనడం జ్యోతికి కీర్తిని తెచ్చిపెట్టిందని జిల్లా అథ్లెటిక్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు పొందడం గర్వించదగ్గ విషయమని జిల్లా ఒలింపిక్ సంఘం మరో ప్రకటనలో అభినందనలు తెలిపింది.
ఆనందానికి అవధుల్లేవు
ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా.. ఆటల్లో పాల్గొనేందుకు జ్యోతిని ప్రోత్సహించాం. శాప్‌లో ప్రత్యేక శిక్షణకు అర్హత సాధించినప్పుడే తొలిసారిగా విశాఖను విడిచి వెళ్లింది. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. అర్జున అవార్డు వచ్చిందని జ్యోతి చెబుతుంటే మా ఆనందానికి అవధులు లేవు. ఇంటికి సైతం రాకుండా అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
– సూర్యనారాయణ, జ్యోతి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment