ఆకాశమే హద్దురా..
డిసెంబర్‌లోనూ వృద్ధి సాధించిన విశాఖ ఎయిర్‌పోర్టు
సాక్షి, విశాఖపట్నం : శీతాకాలం సీజన్‌లో ప్రయాణికులతో పాటు పర్యాటకుల తాకిడి పెరగడంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం కళకళలాడుతోంది. విశాఖ నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య ఊపందుకుంది. 2023 డిసెంబర్‌తో పోలిస్తే.. 2024 డిసెంబర్ నెలలో దేశ, విదేశీ ప్రయాణికుల రాకపోకలతో పాటు విమాన సర్వీసుల్లోనూ గణనీయంగా వృద్ధి సాధించింది.
వింటర్ సర్వీసులు పెరగడంతో..
చలికాలం అంటేనే పర్యాటకులకు పండగ. అందుకే విభిన్న మార్గాల్లో విమానయానాన్ని అందుబాటులోకి తీసుకొస్తూ.. ఆయా సంస్థలు తమ సర్వీసులను పెంచాయి. 2023 శీతాకాలంలో 32 సర్వీసులు ఇక్కడ నుంచి నడవగా.. ఈ ఏడాది 3 సర్వీసులు అదనంగా పెరిగాయి. మొత్తం 35 విమానాలు విశాఖ నుంచి శీతాకాలంలో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, ఢిల్లీ, చైన్నె, జైపూర్, పోర్ట్‌బ్లెయిర్, కర్నూలు, కోల్‌కతా, తిరుపతి, ముంబై తదితర నగరాలకు రాకపోకలు జరుగుతున్నాయి. ఇందులో కొన్ని రోజువారి సర్వీసులుండగా.. మరికొన్ని వారంలో మూడు రోజుల పాటు నడుస్తున్నాయి. వీటితో పాటుగా ఇంటర్నేషనల్ సర్వీసులు కూడా అదరగొడుతున్నాయి. 2023 శీతాకాలంలో విదేశాలకు ఒకే ఒక్క సర్వీసు సింగపూర్‌కు మాత్రమే ఉండేది. ఇప్పుడు మలేషియా(కౌలాలంపూర్), బ్యాంకాక్‌కు ఇంటర్నేషనల్ సర్వీసుల పెరగడం.. ఈ సర్వీసులు కూడా కళకళలాడుతుండటం కలిసొచ్చిన అంశం. ఈ వృద్ధి ఇదే తరహాలో కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. సమ్మర్ షెడ్యూల్ టైమ్‌కు మరిన్ని సర్వీసులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
డిసెంబర్‌లో ప్రయాణికులు, విమాన సర్వీసుల రాకపోకలు
దేశీయ ప్రయాణికుల రాకపోకలు
2023 డిసెంబర్‌లో 213711
2024 డిసెంబర్‌లో 263705
వృద్ధి రేటు 23,39 శాతం
దేశీయ విమాన సర్వీసుల
రాకపోకలు
2023 డిసెంబర్‌లో 1546
2024 డిసెంబర్‌లో 1874
పెరిగిన సర్వీసులు 328
వృద్ధి రేటు 21.22 శాతం
అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు
2023 డిసెంబర్‌లో 5600
2024 డిసెంబర్‌లో 12042
వృద్ధి రేటు 115.04 శాతం
అంతర్జాతీయ విమాన సర్వీసుల
రాకపోకలు
2023 డిసెంబర్‌లో 38
2024 డిసెంబర్‌లో 82
పెరిగిన సర్వీసులు 44
వృద్ధి రేటు 115.79 శాతం
2023 డిసెంబర్‌తో పోలిస్తే 23 శాతం పెరిగిన స్వదేశీ ప్రయాణికులు
డొమెస్టిక్ విమాన సర్వీసుల్లో
21.22 శాతం వృద్ధి
విదేశీ ప్రయాణికులు, సర్వీసులు ఏకంగా
115 శాతం పెరుగుదల
డిసెంబర్‌లో అదరగొట్టింది
డిసెంబర్ నెలలో విశాఖ ఎయిర్‌పోర్టు అదరగొట్టింది. ప్రయాణికుల రాకపోకలు, విమాన సర్వీసుల పరంగా విశాఖ ఎయిర్‌పోర్టు మంచి ఫలితాలు రాబట్టుకుంది. స్వదేశీ ప్రయాణికుల రాకపోకల్లో 2023 డిసెంబర్‌తో పోలిస్తే ఈ సారి 23.39 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా.. డొమెస్టిక్ విమాన సర్వీసుల్లోనూ 21.22 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక అంతర్జాతీయ పాసింజర్ల విషయంలోనూ అదే జోరు కొనసాగింది. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లో ఏకంగా 115.04 శాతం వృద్ధి నమోదవ్వగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోనూ 115.79 శాతం వృద్ధి నమోదైంది. గతంతో పోలిస్తే అదనంగా సర్వీసులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Please login to add a commentAdd a comment