మరణంలోనూ కంటి వెలుగై..
● మరణించిన తండ్రి నేత్రాలను దానం చేసిన కుమారులు ● చింతలగ్రహారంలో ఆదర్శంగా నిలిచిన యువకులు
పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన తండ్రి నేత్రాలను దానం చేసి.. కుమారులు ఆదర్శంగా నిలిచారు. పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన శెట్టి పైడికొండ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో పైడికొండ కుమారులు సత్యప్రసాద్, సంతోష్‌కుమార్‌ల చిన్ననాటి స్నేహితుడు, సాయి హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని వారిని ఓదార్చారు. పైడికొండ నేత్రాలను దానం చేస్తే మరో ఇద్దరికి చూపు వస్తుందని వారికి చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన ప్రసాద్, సంతోష్‌లు తండ్రి నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. అక్కడికి చేరుకున్న ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వి.బాలామణి, డాక్టర్ డి.కనకమహాలక్ష్మిలు పైడికొండ నేత్రాలను సేకరించి ఆస్పత్రికి తరలించారు. నేత్రదానంపై శ్రీనివాస్ చొరవను, పైడికొండ కుమారుల సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment