మహిళలపై మీకున్న గౌరవం ఇదేనా?
● డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు వలంటీర్ల సూటి ప్రశ్న ● రెండో రోజూ కొనసాగిన దీక్ష
సీతమ్మధార: గ్రామ/వార్డు వలంటీర్ల నిరసన దీక్ష శనివారం కూడా కొనసాగింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వలంటీర్లు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వలంటీర్లపై గౌరవం లేదా? మహిళలను గౌరవిస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ? సీఎం చంద్రబాబు గో బ్యాక్.. పవన్ కల్యాణ్ డౌన్ డౌన్’ అంటూ నినదించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ/వార్డు వలంటీర్ స్టేట్ అసోసియేషన్, సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.దీప్తి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రామ/వార్డు వలంటీర్లను యథావిధిగా కొనసాగించాలని, కనీస వేతనంగా రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. బకాయి ఉన్న ఏడు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని, రాజీనామా చేసిన వలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. 2.10 లక్షల మంది మహిళా వలంటీర్లను ప్రభుత్వం రోడ్డున పడేసిందని, మహిళలపై ఇదేనా మీకున్న గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు గాంధీ పార్కు వద్ద మోహరించారు. నిరసన ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్తున్న వలంటీర్లను అడ్డుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పినా వినిపించుకోలేదు. చంద్రబాబు నగరం నుంచి వెళ్లిపోయిన అనంతరం వలంటీర్లను అక్కడి నుంచి వెళ్లనిచ్చారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వలంటీర్లను కొనసాగించాలి
గ్రామ/వార్డు వలంటీర్లను యథావిధిగా కొనసాగించాలని, చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయా రమాదేవి డిమాండ్ చేశారు. వలంటీర్లు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వలంటీర్లకు కనీస వేతనం రూ.10 వేలు చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు వలంటీర్లకు పనులు చెప్పకపోవడం, జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. వీరంతా ప్రభుత్వం నియమించిన వారేనని, రాజకీయ కార్యకర్తలు కాదన్నారు. తక్షణమే వలంటీర్లను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని, బకాయి ఉన్న 7 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సిటు జిల్లా కార్యదర్శి బి.జగన్, ఉపాధ్యక్షుడు జి.అప్పలరాజు, జిల్లా కార్యదర్శి పి.మణి తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment