క్రీడలతో క్రమశిక్షణ
● ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు ● ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్
మురళీనగర్: ఆటల్లో పాల్గొనడం ద్వారా బహుళ ప్రయోజనాలు పొందవచ్చని ప్రముఖ బాక్సింగ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 27వ ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రాంతీయ మీట్ ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఆటలతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపగలుగుతారన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణ రావు మాట్లాడుతూ ఓటమి గెలుపునకు సోపానమన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫిజికల్ డైరెక్టర్ కె.అబ్బాస్ బేగ్ పర్యవేక్షణలో నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు ట్రోఫీ, జ్ఞాపికలు అందించారు. పోటీల నిర్వహణకు సహకరించిన ప్రిన్సిపాల్స్, ఫిజికల్ డైరెక్టర్లను అభినందించారు. సమావేశంలో గైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకట రమణ, అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఐవీఎస్ శ్రీనివాస్, భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, వివిధ ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఇంగ్లిష్ సీనియర్ లెక్చరర్ సరళబాయి, మెకానికల్ లెక్చరర్ మౌనిక సహకరించారు.
చాంపియన్స్ వీరే..
ఈ పోటీల్లో 24 పాలిటెక్నిక్ కాలేజీల క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో గిడిజాల సాయిగణపతి పాలిటెక్నిక్ విద్యార్థులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల నుంచి భీమిలి ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధిక ట్రోఫీలు గెలుచుకుని తమ సత్తా చాటారు. బాలురు ఓవరాల్ చాంపియన్ గిడిజాల సాయి గణపతి పాలిటెక్నిక్, బాలికల ఓవరాల్ చాంపియన్స్‌గా భీమిలి ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ విద్యార్థులు నిలిచారు. బాలుర గేమ్స్ చాంపియన్‌గా గిడిజాల సాయి గణపతి పాలిటెక్నిక్, బాలికల గేమ్స్ చాంపియన్‌గా భీమిలి ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్, బాలుర స్పోర్ట్స్ చాంపియన్స్ గిడిజాల సాయి గణపతి పాలిటెక్నిక్, బాలికల స్పోర్ట్స్ చాంపియన్‌గా భీమిలి పభుత్వ మహిళ పాలిటెక్నిక్ సాధించారు. బాలుర విభాగంలో గిడిజాల సాయి గణపతి పాలిటెక్నిక్ నుంచి వ్యక్తిగత చాంపియన్స్ ఎన్.ఈశ్వర్ వర్దన్, బాలికల వ్యక్తిగత చాంపియన్‌గా ఎస్.మల్లీశ్వరి నిలిచారు. వీరికి ట్రోఫీలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment