స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులపై ప్రధాని స్పష్టత ఇవ్వాలి
డాబాగార్డెన్స్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటిస్తున్న సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చడంపై స్పష్టత ఇవ్వాలని సిటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. శనివారం సిటూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సొంత ఇనుప ఖనిజం గనులున్న ప్రతి స్టీల్‌ప్లాంట్‌కు టన్నుకు రూ.600 (ఇనుక ఖనిజం తవ్వకానికి) ఖర్చు అవుతుందన్నారు. అయితే ప్రస్తుతం విశాఖ స్టీల్‌ప్లాంట్ రూ.8వేలుపైగా ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కారణంగా సాలీన రూ.3,500 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందని, దీనిని నష్టంగా చూపించి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని కుట్ర చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. విశాఖ స్టీల్‌కార్మికులు, అధికారులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం, ఉన్న జీతాన్ని కూడా తగ్గించి లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. జీతాలు రాకున్నా, నవంబర్, డిసెంబర్ నెలల్లో శత శాతం ఉత్పత్తి సాధించిందన్నారు. విశాఖ స్టీల్‌లో రెండు కన్వర్టర్ల ఉత్పత్తి 115 శాతం రికార్డు స్థాయిలో ఉత్పత్తి పెంచిందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పోటీగా ఆర్సీలార్ మిట్టల్‌తో నక్కపల్లిలో ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్‌ను పెట్టించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ఆర్సీలార్ మిట్టల్‌కు సొంత ఇనుప ఖనిజ గనులు కేటాయించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయన్నారు. ఏ స్టీల్‌ప్లాంట్‌లో లేని విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 55 ఏళ్లు దాటిన వారందర్నీ తొలగించడానికి రంగం సిద్ధం చేసిందని, మరో వైపు ప్రతి కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న 30 శాతం కార్మికులను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ పర్యటన ముగిసిన తరువాత ఈ ప్రక్రియ నిర్వహించడానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసిందన్నారు. మోదీ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిరసన వ్యక్తం చేసేందుకు నిర్ణయించిందని చెప్పారు. సోమవారం కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి చలో కలెక్టరేట్, 7న విశాఖ స్టీల్ పోరాటానికి మద్దతుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. సమావేశంలో సిటూ ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్ పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు
Comments
Please login to add a commentAdd a comment