పర్యాటక రంగంలో విశాఖ అగ్రస్థానం
విశాఖ సిటీ : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖను పర్యాటకంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి పేర్కొన్నారు. విశాఖలో పర్యాటక ప్రాజెక్టులు, ప్రణాళికల రూపకల్పన, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై ఆమె జిల్లా అధికారులతో వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ సంస్థ పరిధిలో ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టుల కోసం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కై లాసగిరిపై నేచర్ కాటేజీలు, బీచ్ వ్యూ కేఫ్ వంటి ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఫైవ్ స్టార్ మోడల్‌లో ఆధునిక వసతులతో కన్వెన్షన్ సెంటర్, రుషికొండ వద్ద హేబిటేట్ సెంటర్, మధురవాడలో అర్బన్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, మెడికల్ టూరిజం కాన్సెప్ట్‌లో భాగంగా అనకాపల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విజయనగరంలో అధునాతనమైన వసతులు, హంగులతో కూడిన కన్వెన్షన్ సెంటర్, కాపులుప్పాడలో నేచురల్ హిస్టరీ పార్కు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ సమావేశాల నిర్వహణ, బహుళ ప్రయోజనాల దృష్ట్యా సుమారు 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో 5 వేల మందికి సరిపడా అతిపెద్ద మల్టీ మోడల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఎకో టూరిజం రిసార్టులు, తాటిపూడి, గంభీరం లాంటి ప్రాంతాల్లో బోట్ క్లబ్‌లు, బహుళ ప్రయోజనాలు, మార్కెటింగ్ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని మెగా అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. పోర్టు, అటవీ, జీసీసీ, ఇతర విభాగాల ఆధ్వర్యంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎండీకి వివరించారు. జీసీసీ ఎండీ కల్పనాకుమారి మాట్లాడుతూ అరకు కాఫీకి మరింత గుర్తింపు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని, అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జూ క్యూరేటర్ మంగమ్మ మాట్లాడుతూ జూలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, విదేశాల్లో మాదిరిగా ఆధునిక హంగులు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారిణి జ్ఞానవేణి, డీవీఎం జగదీష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి
Comments
Please login to add a commentAdd a comment